Monday, December 23, 2024

వార్‌రూం వేదికగా ఏఐసిసి ప్రత్యేక సమీక్ష

- Advertisement -
- Advertisement -

హోరాహోరీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
పలువురు అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్
కేడర్‌తో పాటు అసంతృప్తులను దారికి తీసుకొచ్చేలా కాంగ్రెస్ అధిష్టానం

మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీభవన్ వార్‌రూం వేదికగా హోరాహోరీగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులు పైచేయి సాధించేలా ఏఐసిసి సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ ఇంకా బలం పుంజుకోవాలో అక్కడ ఆయన మకాం వేసి, పార్టీ అబ్జర్వర్ల ద్వారా ప్రస్తుత పరిస్థితులపై ఆయన సమీక్ష జరుపుతున్నారు. గాంధీ భవన్‌లోని వార్ రూమ్ నుంచి ఆయన పలువురితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అభ్యర్థులను గెలుపు దిశగా ఆయన తీసుకెళుతున్నారు.
మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో…
రెండు రోజులుగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపిల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మరింత బలపడాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీ తరఫున ఇప్పటికే అక్కడ తిరుగుతున్న పార్టీ అబ్జర్వర్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. దక్షిణ తెలంగాణలో దాదాపుగా సంపూర్ణమైన పట్టు సాధించినా మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలతో పాటు మేనిఫెస్టోలోని అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఇప్పుడున్న పట్టును మరింత పెంచుకోవాలని అభ్యర్థులకు, అబ్జర్వర్లకు ఆయన సూచించారు.
ఈ 5 రోజులు ప్రజల్లో ఉండాలి
పార్టీ తరఫున చాలాకాలంగా సర్వే చేస్తున్న సునీల్ కనుగోలు టీమ్ ఇచ్చిన నివేదికతో పాటు అధిష్టానం చేయించిన ఫ్లాష్ సర్వేలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని పార్టీ లీడర్లకు కెసి వేణుగోపాల్ స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థులు ప్రచార తీవ్రతను తగ్గించారని, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ లోకల్ కేడర్ జనంలోకి వెళ్లడంలేదని పార్టీ అబ్జర్వర్లకు ఆయన వివరిస్తున్నారు. రానున్న ఐదు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేలా ఆయన వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఇన్ని రోజులు కష్టపడినా ఈ ఐదు రోజులు మాత్రం విశ్రాంతి లేకుండా జనంలోనే గడపాలని ఆయన అభ్యర్థులకు సూచిస్తున్నారు.
అసంతృప్త నేతలను దారికి తెచ్చుకొని….
ఏఐసిసి తరఫున సీనియర్ నేతలను ఈ హోరాహోరీ అసెంబ్లీ సెగ్మెంట్లకు పంపడంతో పాటు అభ్యర్థులు, పార్టీ కేడర్‌ను పరుగెత్తించేలా కెసి వేణుగోపాల్ ఎప్పటికప్పుడు వారిని సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రతి రోజు నాలుగైదు సెగ్మెంట్లలో ప్రచారం చేస్తుండడంతో క్యాంపెయిన్ కమిటీ మొదలు వివిధ కమిటీల మధ్య మరింత సమన్వయంతో వీక్‌గా ఉన్న స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకోవడమే లక్షంగా ప్రచారం చేయాలని కెసి వేణుగోపాల్ కేడర్‌తో స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో నిర్దిష్టమైన కారణాలు ఉన్నట్లు కెసి వేణుగోపాల్ గుర్తించారు. దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న నేతలను కాదని ఇటీవల చేరినవారికి టికెట్లు ఇవ్వడంతో పాత నేతలు, కేడర్ నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్న నిర్ధారణకు ఆయన వచ్చారు.
ప్రస్తుతం రోజువారీ సమావేశాలు..
అసంతృప్తి నేతలు దారిలోకి వచ్చినా వారి కింద పనిచేసే శ్రేణుల్లో ఇంకా ఆ మేరకు సహకారం అందడం లేదన్న స్పష్టతకు ఆయన వచ్చారు. ప్రస్తుతం వారితో రోజువారీ సమావేశాలు ఏర్పాటు చేసి తగిన భరోసా కల్పించి ప్రజల్లో పార్టీ గెలుస్తుందనే విశ్వాసాన్ని మరింతగా పెంచేలా ఆయన సూచనలు చేస్తున్నారు. దిగువస్థాయి లీడర్ల మధ్య పరస్పరం నమ్మకం లేకపోవడం వల్ల సహకారంలో తేడా వస్తుందని, అందరూ పార్టీ కోసం కష్టపడుతున్నందున అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత, పదవులు, ప్రోత్సాహం ఉంటుందన్న నమ్మకం వారిలో కలిగించేలా ఏఐసిసి తరఫున నియోజకవర్గాల్లో పనిచేస్తున్న అబ్జర్వర్లు చొరవ తీసుకోవాలని కెసి వేణుగోపాల్ సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News