Monday, December 23, 2024

మానవత్వానికి మచ్చ

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణ అమానుషమైన మలుపు తిరిగి దేశం తల వంచుకొనేలా చేసింది. మెజారిటీ మెయితీ తెగకు చెందిన మూకలు గిరిజన కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యం బుధవారం నాడు వైరల్ కావడంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ దృశ్యాన్ని చూపించవద్దని ట్విట్టర్‌కు, ఇతర సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ విషయం విశ్వమంతటికీ తెలిసిపోయింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వార్త చూసి తాము గాఢంగా చలించిపోయామని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోకపోతే తామే రంగంలోకి ప్రవేశించవలసి వస్తుందని హెచ్చరించింది.

వీడియోలోని దృశ్యాలు రాజ్యాంగానికి అసాధారణ ఉల్లంఘనలని, మానవ హక్కులకు భంగకరమైనవని అభిప్రాయపడింది. ఉద్రిక్త వాతావరణంలో మహిళలను హింసాయుత దాడికి సాధనాలుగా చేసుకోడం, శత్రువులను అదుపులోకి తెచ్చుకోడానికి వారి మహిళలపై హింసను ప్రయోగించడం గత కాలంలో జరిగిందని, రాజ్యాంగ చోదిత ప్రజాస్వామ్యంలో అటువంటివి చెల్లవుగాక చెల్లవని స్పష్టం చేసింది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకొంటున్నదీ ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. మణిపూర్‌లో ఈ ఘర్షణలు, హింస మొదలై రెండు నెలల 17 రోజులైంది. దీనిపై మాట్లాడాలని, హింసను ప్రేరేపిస్తున్న వారిని గట్టిగా హెచ్చరించాలని ఎవరు ఎంతగా ప్రాధేయపడినా నోరు విప్పని ప్రధాని మోడీ మొదటిసారిగా గురువారం నాడు మౌనం వీడారు.

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మొత్తం 140 కోట్ల భారతీయులు సిగ్గుపడేలా చేసిందని ఆయన అన్నారు. చట్టం తనకున్న పూర్తి బలంతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ విధంగా ఆయన దీనిని ఒక విడి ఘట్టంగానే చూశారు గాని, రెండు మాసాలకు పైగా మణిపూర్‌లో సాగుతున్న ధ్వంస, దగ్ధ, మారణకాండలో భాగంగా పరిగణించి దాని మూలాలను ప్రస్తావించి, బాధ్యత స్వీకరించి దానికి తగిన పరిష్కారం కనుగొంటామని హామీ ఇవ్వలేదు. ఎందుకంటే కేంద్రంలో, మణిపూర్‌లో వున్నవి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే. అంతేకాక మైదాన ప్రాంతమైన లోయలో నివసిస్తున్న మెయితీ తెగవారు హిందువులు కావడం, బాధిత కుకీలు క్రైస్తవులు కావడం కూడా ఆయనను ఇరకాటంలోకి నెట్టివేసిన చేదు వాస్తవం. ఇప్పటికెప్పుడో రాష్ట్రపతి పాలన పెట్టి వుండాల్సింది. కశ్మీరులో మోహరించినట్టు పెద్ద ఎత్తున భద్రతా దళాలను దించి వుండాలి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా మెయితీయే. తమకు బిసిలుగా, ఎస్‌సిలుగా గుర్తింపు వున్నప్పటికీ ఆదివాసీలుగా గుర్తించి కుకీలకు, నాగాలకు కల్పిస్తున్న సౌకర్యాలన్నీ తమకూ ఇవ్వాలంటూ మెయితీలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు తమ సుదూర గతాన్ని మద్దతుగా చూపిస్తున్నారు. వారి డిమాండ్ సానుకూలంగా పరిశీలించదగ్గది అంటూ మణిపూర్ హై-కోర్టు చేసిన ఒక సిఫార్సు కొండల్లో నివసించే కుకీలు, నాగాలలో తీవ్ర ఆందోళన కలిగించింది. దానికి వ్యతిరేకంగా కుకీలు గత మే 3వ తేదీన రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లోనూ ఊరేగింపులు తీశారు. దానితో తెగల మధ్య ఘర్షణలు భగ్గుమన్నాయి.

ఇంత వరకు 150 మంది చనిపోయారు. వేలాది మంది స్వస్థలాలు విడిచి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. ఇప్పుడు వైరల్ అయిన వీడియో మే 4వ తేదీన జరిగిన దుర్మార్గానికి సంబంధించినది. ఆ రోజు కంగ్ పోక్ పి అనే జిల్లాలోని కుకీల గ్రామంపై మెయితీలు పెద్ద సంఖ్యలో దాడి చేసి ఇళ్ళను ధ్వంసం చేయడం, దగ్ధం చేయడం ప్రారంభించినట్టు వార్తలు చెబుతున్నాయి. వారి నుంచి తప్పించుకోడానికి సమీప అడవుల్లోకి పారిపోతున్న ఒక కుటుంబానికి చెందిన మహిళలను రక్షించడానికి పోలీసులు తమ వాహనంలో తీసుకు వెళుతుండగా మూకలు అడ్డుకొని 20, 40 ఏళ్ళ వయసులోని ఇద్దరు మహిళలను తమ వెంట తీసుకు వెళ్ళారని ఆ తర్వాత వారిని వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించారని తెలుస్తున్నది. 20 ఏళ్ళ మహిళ సోదరుడు అడ్డుకోగా అతడిని హతమార్చారని, అంతకు ముందే వారి తండ్రిని హత్య చేశారని సమాచారం. మెయితీ మిలిటెంట్లు మణిపూర్‌లోని 357 చర్చీలను దగ్ధం చేశారని, ప్రధాని మోడీ రాజ్యాంగపరంగా, రాజకీయంగా, నైతికంగా విఫలమయ్యారని మిజోరం బిజెపి మాజీ ఉపాధ్యక్షుడు వనరామ్ చుంగ ఆరోపించారు. ఆయన ఈ నెలలోనే బిజెపికి రాజీనామా చేశారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా ఈ విషయానికి సంబంధించిన వాస్తవాలన్నింటినీ పార్లమెంటుకు తెలియజేయడం మంచిది. భిన్న మతాలు, తెగలు, కులాల, విభిన్న వర్గాల సహజీవన ధామంగా వర్ధిల్లుతూ వచ్చిన భారత దేశం ఇలా ప్రజల మధ్య విదేషాలతో రగలడం ఇకనైనా ఆగాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News