Thursday, January 23, 2025

ప్యాట్నీ సెంటర్ వద్ద గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

గద్దర్ సంస్మరణ సభ తీర్మానం

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ప్రజా యుద్ధనౌక, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్ విగ్రహాన్ని ,గద్దర్ ప్రజా కళల మ్యూజియం ‘గద్దర్ ఫోటో గ్యాలరీ’ని ఏర్పాటు చేయాలని వామపక్ష నాయకులు, ప్రముఖ సినీగేయ,దర్శకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మ్యూజియం నిమిత్తం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి, ఇందులో గద్దర్ పాటు ప్రముఖ కళాకారుల ఆవిష్కరణలు, చరిత్రను అందుబాటులో పెట్టాలన్నారు. ఈ మేరకు గద్దర్ సంస్మరణ సభ తీర్మానించింది. వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాయుద్ధనౌక, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్ సంస్మరణ సభ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది.

ఈ సభకు వామపక్ష నాయకులు కూనంనేని సాంబశివ రావు(సిపిఐ), తమ్మినేని వీరభద్రం(సిపిఐ(ఎం), సినీ దర్శకులు బి.నర్సింగరావు, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, గాయకులు జయరాజ్, గద్దర్ కుమార్తె వెన్నెలతో పాటు పోటు రంగారావు,(సిపిఐ(ఎం.ఎల్.ప్రజాపంథా), సాదినేని వెంకటేశ్వర్ సిపిఐ(ఎం.ఎల్-న్యూడెమోక్రసి ), వనం సుధాకర్ (ఎంసిపిఐ), ప్రసాద్(సిపిఐ-ఎం.ఎల్),మురహరి(ఎస్ చలపతిరావు (సిపిఐ ఎం.ఎల్.న్యూడెమోక్రసి),రమేష్ రాజా(ఆర్ కొమురన్న (సిపిఐ-ఎం.ఎల్.(జనశక్తి) హాజరయ్యారు. ఈ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ సభాధ్యక్షత వహించగా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి.నర్సింహరావు సభకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన పాటలతో ప్రజలలో చైతన్యం రగిలించిన మహానీయుడు గద్దర్ మరణం లేదని, ప్రజల హృదయాల్లో, కళాకారుల పాటలో ఆయన సజీవంగా ఉంటారని అన్నారు. గద్దర్ ప్రస్థానమంతా అణగారిన వర్గాలకే అంతకిమైందని, నిత్యం వారి కోసమే పరితపించేవారని, తన చివరి శ్వాస వరకు ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని కోరుకున్నారన్నారు. కమ్యూనిస్టుల వల్లనే ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందని విశ్వసించిన వ్యక్తి గద్దర్ అని, ఆయన కమ్యూనిస్టు ఎర్రజెండాకు నిజమైన వారసుడని చెప్పారు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే గద్దర్ అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రపంచంలోనే ప్రముఖులైన కళాకారుల్లో గద్దర్ ఒకరని, ఈ శతాబ్ధం ఆయనదేనన్నారు. భవిష్యత్ తరాలకు కావాల్సిన కవిత,సాహిత్య సంపదను గద్దర్ సృష్టించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News