బెంగళూరు: కొత్త ఏడాది 2024 ఆరంభం అదిరింది. భవిష్యత్తులో భారత్ భూకక్షలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాజా గా ఇస్రో అంతరిక్షంలో కీలకమైన శక్తి వనరుల వినియోగంపై ప్ర యోగం చేపట్టింది. సరికొత్త ఫ్యూయల్ సెల్‌ను సోమవారం విజయవంతంగా దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో నిర్ణీత లక్షాల ఛేదనలో మరో విజయం ఏడాది తొలిరోజునే నమోదు చేసుకుంది. శ్రీహరికోట నుంచి నిర్ణీత లక్షంతో తలపెట్టిన తొట్టతొలి ఎక్స్ రే పోలారిమీటర్ శాటిలైట్ ( ఎక్స్‌పోశాట్) ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగాల సతీష్ ధావన్ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9 గంటల పది నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి సి 58 వాహకనౌక ద్వారా దీనిని నిర్ధేశిత కక్షలోకి పంపించారు. 25 గంటల అవిచ్ఛిన కౌంట్‌డౌన్ తరువాత నిప్పులు చిమ్ముకుంటూ , నారింజ వెదజల్లుతూ ఈ రాకెట్ నుంచి శాటిలైట్ విడిపోయి కక్షకు సాగింది. దీనితో ఈ ఆరంభ ప్రయోగం విజయవంతం అయిన విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తల బృందం సగర్వంగా ప్రకటించింది.
480 కిలోల బరువున్న ఎక్స్‌పోశాట్‌ను నింగిలోకి పంపించారు. ఇప్పుడు కూడా పిఎస్‌ఎల్‌వి రాకెటు ఇస్రోకు నమ్మిన బంటు అయింది. ఇప్పుడు ఈ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించిందని ఈ ప్రయోగ ఫోటోలు, దీని వివరాలతో ఇస్రో సామాజిక మాధ్యమాలలో వివరణాత్మక ప్రకటనలు వెలువరించింది. ఈ శాటిలైట్ అంతరిక్షంలో అత్యంత కీలకమైన అధ్యయనాలకు దిగుతుంది. ప్రత్యేకించి శక్తివంతమైన ఎక్స్‌రే మూలాల అన్వేషణ సాగుతుంది. పాలపుంతల్లోని పలు వింతలు, సృష్టి రహస్యాల ఆరాలో గడుపుతుంది. ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. కాగా శాటిలైట్‌ను కక్షలోకి తీసుకువెళ్లిన పిఎస్‌ఎల్‌వికి ఇది 60వ ప్రయోగ దశ. ఇప్పటివరకూ దీనిద్వారా జరిపిన పలు ప్రయోగ పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఇప్పుడు పంపించిన శాటిలైట్‌తో పాటు మరో పది నానో ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపించారు. ఇవి నానోలే అయినప్పటికీ అత్యంత కీలక ప్రయోగాలకు ఉద్ధేశించినవి. కాగా స్టార్టప్ కంపెనీల వినూత్న సృష్టి ఫలితాలు. ప్రత్యేకించి విక్రమ్‌సారాభాయ్ స్పేస్‌సెంటర్ రూపొందించిన ఫ్యూయల్ సెల్స్‌ను కూడా శాటిలైట్ ద్వారా నింగిలోకి పంపించారు. పిఎస్‌ఎల్‌వి ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యుల్‌లో భాగంగా దీన్ని నింగిలోకి పంపించింది.
రోదసిలో సమర్థవంతమైన సుస్థిర శక్తిని నేరుగా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్‌తో విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సుధీర్ఘకాలం అంతరిక్ష కేంద్రానికి కరెంటును ఇది సరఫరా చేయగలదు. భవిష్యత్తులో భారత్ విస్తరించబోయే స్పేస్ స్టేషన్ కోసం ఈ ప్రయోగం కీలక ముందడుగు. 650 కిలో మీటర్ల తక్కువ స్థాయి భూ కక్షలోకి శాటిలైట్‌ను ప్రవేశపెట్టినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. పిఎస్‌ఎల్‌వి పేలోడ్‌లో పలు రకాల శాటిలైట్ల వ్యవస్థను సంక్షిప్తంగా పొయమ్‌గా వ్యవహరించారు. ముందు ఎంచుకున్న కక్షలోకి విజయవంతంగా శాటిలైట్‌ను పంపించిన తరువాత దీని ఎత్తును దించి 350 కిలోమీటర్ల పరిధికి తీసుకువచ్చే ఘట్టం కూడా సైంటిస్టులు విజయవంతంగా నిర్వర్తించారు. ఇప్పుడు ఈ శాటిలైట్‌కు అనుసంధానంగా సాగిన చిన్నపాటి శాటిలైట్లలో మహిళ రూపొందించిన శాస్త్రీయ సామర్థపు పరికరం కూడా ఉండటం దేశానికి స్ఫూర్తిదాయకం అయిందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ప్రయోగం విజయవంతం అయినందున ఇప్పుడు తాను అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరింత ఆనందంగా తెలియచేస్తున్నానని స్పష్టం చేశారు. 2024 జనవరి 1 పిఎస్‌ఎల్‌వి మిషన్ విజయాలలో మరో మైలురాయి నిలిచిందని తెలిపారు.
అంతరిక్ష ఎక్స్‌రేల ఆవిర్భావ పరిశీలన కీలకం
నింగిలో నెలకొన్న అపార విస్తారిత విద్యుత్ అయస్కాంత క్షేత్రాల భరిత ఎక్స్‌రేల లోగుట్టు ఇప్పటివరకూ అంతుచిక్కకుండా ఉంది. ఈ దిశలో తక్కువ స్థాయిలో ప్రయోగాలు జరిగాయి. ఇప్పుడు తలపెట్టిన శాటిలైట్ ద్వారా ఈ ఎక్స్‌రేల అధ్యయనం కీలకం అవుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. పాలపుంతల లోతుల్లోని విశ్వరహస్యాలను వెలికితీసేందుకు అవసరం అయిన అధ్యయనం సాగుతుందని వివరించారు. అన్నింటికి మించి అంతరిక్షంలో భారతదేశం తరఫున ఏర్పాటు అయ్యే పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనువుగా ఫ్యూయల్ సెల్స్‌ను కూడా అంతరిక్షంలోకి పంపించడం మరింత కీలక అంశం అయింది. అంతరిక్ష ఎక్స్‌రేలపై ఇప్పటివరకూ పరిశోధనలు జరిపిన ఘనత కేవలం అమెరికాకు చెందిన నాసాకే సొంతం అయింది. 2021 డిసెంబర్‌లో ఈ ప్రయోగం నిర్వహించారు. సూపర్‌నోవా పేలుళ్ల విషయం, అవశేషాలపై అధ్యయనం జరిగింది. బ్లాక్‌హోల్స్ ద్వారా వెలువడే కణజాల వెల్లువలను కూడా నాసా తమ పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు ఈ దిశలో మరింత కీలక అంశాల ఆవిష్కరణకు భారతదేశ ఇస్రో సంకల్పించింది. జనవరి 1 నాటి ప్రయోగం విజయవంతం అయిందని ఇప్పటి మిషన్ డైరెక్టర్ జయకుమార్ ఎం తెలిపారు. ఇప్పటి మిషన్ పేలోడ్స్ ప్రయోగాలలో సిలికాన్ సంబంధిత అత్యంత శక్తివంతమైన ఇంధన బ్యాటరీ, అమోచ్యూర్ రేడియో శాటిలైట్ సేవల అనుసంధానాలు ఉన్నాయన్నారు.