Thursday, January 23, 2025

ఉత్తమ ఎన్నికల పద్దతులపై అధ్యయనం : వికాస్‌రాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివిధ మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన, ఎన్నికల నిర్వహణకు అనుసరించిన పద్దతులను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఆ రాష్ట్ర అధికారులు అనుసరించిన వివిధ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికి ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ నేతృత్వంలోని ఆరుగురు అధికారుల బృందం బెంగుళూరు పర్యటనకు వెళ్లింది.

ఈ సందర్భంగా కర్ణాటక సిఈఓ కార్యాలయ అధికారులు, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బిబిఎంపి) అధికారులతో రాష్ట్ర ఎన్నికల బృందం విస్తృతంగా చర్చించింది. ఎన్నికల నిబంధనలు, నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడం, ఫిర్యాదుల నిర్వహణ, ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాలపై వారు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ ఐటి అప్లికేషన్ల వినియోగంపై వారు ఆరా తీశారు. ఎన్నికలలో నేతల పర్యటనలు, నగదు, ఉచితాలు, మద్యం మొదలైన వాటి పంపిణీని నిరోధించడానికి వినియోగించిన చట్టపరమైన నిబంధనలను బృందానికి అధికారులు వివరించారు. పోలీస్, ఎక్సైజ్ , పరోక్ష పన్నుల తదితర అంశాలపై కర్ణాటక ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులతో కూడా బృందం సంభాషించింది. పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కర్ణాటక సిఈఓ మనోజ్ కుమార్ మీనాకు జ్ఞాపికను అందజేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల బృందంలో అదనపు సిఈవో లోకేష్‌కుమార్, కమిషనర్ జీహెచ్‌ఎంసీ , జిల్లా ఎన్నికల అధికారి హైదరాబాద్ రోనాల్డ్ రోస్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, చిరంజీవి, భవానీశంకర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News