Sunday, December 22, 2024

ఇదో ప్రేమకథ.. క్లైమాక్స్ మారిపోయింది

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ఇంట్లో పెద్దవాళ్లు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో చావే శరణ్యమని నిర్ణయించుకున్న ఒక టీనేజ్ జంట కొండపై నుంచి దూకింది. అయితే భూమ్మీద వారికి ఇంకా నూకలు మిగిలి ఉండడంతో అమర ప్రేమికులుగా మారకుండా ముళ్ల పొదలపైన పడ్డారు. గాయాలపాలైన ఆ యువజంట చివరకు ఆసుపత్రి పాలయ్యింది. ఈ వింత సంఘటన కర్నాటక రాజధాని బెంగళూరు సమీపాన ఉన్న రామనగర జిల్లాలోని రామదేవర బెట్ట వద్ద చోటుచేసుకుంది.

19 ఏళ్ల చేతన్, సాహిత్య చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. చేతన్ బిఇ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నగరభావిలో నివసిస్తున్నాడు. ఇక సాహిత్య బికాం మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె కత్రిగుప్పే వాసి. ఇద్దరూ డాక్టర్ విష్ణువర్ధన్ రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ కాలేజీకని ఇంట్లో నుంచి బయల్దేరి రామదేవర బెట్ట కొందల వద్దకు చేరుకున్నారు. అయితే ఉదయం 11.15 ప్రాంతంలో కొండల కింద స్కూల్ బ్యాగులు పడి ఉండడాన్ని అటుగా వెళుతున్న ఒక వ్యక్తి చూశాడు. ఎందుకో సందేహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రామనగర రూరల్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జి గురురాజ్ వెంటనే అటవీ శాఖ అధికారులను వెంటపెట్టుకుని అక్కడకు చేరుకున్నారు. ఆ యువజంట ఆచూకీ కనిపెట్టేందుకు వారికి రెండు గంటలు పట్టింది. వారిని తుప్పల్లో నుంచి బయటకు తీయడానికి మరో రెండు గంటలు పట్టింది. వెంటనే వారిద్దరినీ మైసూరు రోడ్డులోని రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. చేతన్, సాహిత్యల ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, వారిద్దరికీ అనేక చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయని డాక్టర్లు తెలిపారు.

కాగా.. వారిద్దరూ బ్యాగులు వదిలిన చోట ఒక సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. సాహిత్య రాసినట్లుగా భావిస్తున్న ఆ నోట్‌లో తాను చేతన్, ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నామని, తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని, కాని తమ పెద్దవాళ్లు తమ ప్రేమను వ్యతిరేస్తున్నారని పేర్కొని ఉంది. అందుకే తాము కలసి చావాలని నిర్ణయించుకున్నామని, తమ శవాలను తమ తల్లిదండ్రులు చూడకూడదన్న ఉద్దేశంతోనే తాము ఇంట్లో చావకూడదని నిర్ణయించుకున్నామని సాహిత్య రాసింది.
తుప్పల్లో పడడం వల్లే 250 అడుగుల ఎత్తయిన కొండపై నుంచి కిందకు దూకినా వీరిద్దరు బతికారని పోలీసులు తెలిపారు. ఒక రెండు రోజులు వీరి ఆచూకీ లభించకపోయి ఉంటే వారిద్దరూ మరణించి ఉండేవారని పోలీసులు చెప్పారు.
షోలే హిందీ సినిమా షూటింగ్ ఇక్కడే చాలావరకు చిత్రీకరణ జరుపుకుంది. అత్యంత సుందరంగా, ఏకాంతానికి అనువుగా ఉండే ఈ కొండల వద్దకు ప్రేమపక్షులు తరచు వస్తుంటాయి. అంతేగాక దేశంలో రాబందుల సంరక్షణ ప్రదేశం ఇదొక్కటే కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News