Monday, January 20, 2025

దొంగ ముఖ్యమంత్రి కాకూడదు

- Advertisement -
- Advertisement -

రేవంత్‌రెడ్డి… రేటెంత రెడ్డీ!
షర్మిల కీలక వ్యాఖ్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దొంగలు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాకూడదని వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు.వచ్చే ఎన్నికల్లో దొంగలకు ఓటు వేయవద్దని ప్రజలకు సూచించారు. సోమవారం లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ఆర్‌టిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ రేవంత్‌ను దోషి అని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు. సుప్రీంకోర్టులో కేసు కొట్టేయాలని రేవంత్‌ రెడ్డి పిటీషన్ వేయగా , వీళ్లు దోషులే అని న్యాయస్థానం చెప్పిందన్నారు. ఆయనపైన ఉన్న కేసు కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

అన్ని పార్టీల్లో దొంగలు ఉంటారని , కాని దొంగలు ఎప్పటికీ ముఖ్యమంత్రులు కాకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో దొంగలకు ఓటు వేయవద్దని సూచించారు. రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి రేటెంత రెడ్డీ? అంటున్నారని విమర్శించారు. తమ పార్టీ ప్రజలకోసమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. తాను ఏ పదవి కోసమో ..ఎవరో తమకు కిరీటాలు పెట్టాలనో కోరుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌పార్టీకి ఓటు వేయవద్దన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి తన గురించి ,తన రాజకీయాల గురించి మాట్లాడేముందు ఆయన కథ ఏమిటో ఆయన చూసుకుంటే మంచిదన్నారు. గతంలో సజ్జల వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీతో ఏమాత్రం సంబంధం లేదని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ సంబంధం ఉందని తమపార్టీ గురించి, తమపార్టీ నిర్ణయాల గురించి మాట్లాడారని ప్రశ్నించారు. తమతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలన్నారు. ఏపిలో రోడ్లు , విద్యుత్ తదితర సమస్యలపైన సిఎం కెసిఆర్ బహిరంగంగానే విమర్శించారని ముందు కేసిఆర్ చేసిన విమర్శలకు సజ్జల సమాధానం చెప్పాలని షర్మిల పేర్కొన్నారు. బిజేపి, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్యన రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే కాళేశ్వరం ఘటనపట్ల కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బిజేపి ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితికి ,పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన బిఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంలో బీజేపికి మద్దతుగా ఉండాలన్నదే ఆ రెండు పార్టీల మద్య ఒప్పందం అని షర్మిల ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News