Saturday, April 26, 2025

మానవత్వానికి మాయని మచ్చ

- Advertisement -
- Advertisement -

కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘటన అమానవీయమైనది. మానవత్వమే తలదించుకునే విధంగా ఆ హత్యాకాండ జరిగింది. అందులో మరణించిన వారి కుటుంబాలకు జరిగిన నష్టాన్ని, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా ఎవ్వరం భర్త్తీ చేయలేం. ఇటీవల జరిగిన ఘటనల కన్నా ఇది కోట్లాది మందిని కలవరపరిచింది. భూతల స్వర్గంగా భావిస్తున్న కశ్మీర్‌ను చూడాలని వెళ్లిన పర్యాటకులకు జరిగిన ఈ ఘోర అనుభవాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీనిని ముక్తకంఠంతో ఖండించాయి. ఇతర ప్రజా సంస్థలు, సంఘాలు, వ్యక్తులు అందరూ ఈ నరమేధాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన విధంగానే ప్రతిస్పందించింది. ఈ దుర్ఘటనకు కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్)ను, దానికి సహకారం అందించారని భావించిన లష్కర్ ఎ తోయిబాను, దీనికి వెన్నుదన్నుగా ఉన్నదనుకుంటున్న పాకిస్థాన్‌ను లక్షంగా చేసుకొని చర్యలు చేపట్టింది. తక్షణమే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేయడం, నీటి ఒప్పందాలను వెనక్కు తీసుకోవడంతోపాటు ఇంకా అనేక చర్యలు చేపట్టింది. సరిహద్దులను మూసివేయడం కూడా వెంటనే అమలు చేశారు. అదే విధంగా దాడికి బాధ్యులైన వారి లక్షంగా గాలింపు ముమ్మరం చేశారు. ఇవన్నీ ఊహించినవే. ప్రజల నిరసన, ప్రభుత్వ తీవ్ర నిర్ణయాలు, రాజకీయ ఏకాభిప్రాయం అన్ని కూడా అనుకూలంగానే. అయితే వీటన్నింటికి తోడుగా కశ్మీర్ ప్రజల్లో పెల్లుబుకిన నిరసన, హత్యాకాండపట్ల వాళ్ల ఆవేదన భారత ప్రభుత్వానికి ఎంతో నైతికంగా గొప్ప విజయం. కశ్మీర్‌లోని చాలా చోట్ల ప్రజలు వీధుల్లోకి వచ్చి, ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదని, మానవత్వం మీద జరిగిన దురాగతంగా ప్రకటించారు. నేను చూసిన కొన్ని మీడియాల్లో ముఖ్యంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో మాట్లాడిన మాటలు, నిరసన తెలిపిన తీరు ఉగ్రవాదులకు చెంపపెట్టుగా భావించాలి. శాంతి కావాలి, కశ్మీర్‌లు భారత్ వైపే, మాకు టెర్రరిజం వద్దు అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు గత కొంత కాలంగా కశ్మీర్ ప్రజల్లో ఉన్న భావాలను బయటపెట్టాయి. కశ్మీర్ ప్రజలు అటు టెర్రరిస్టులతో, ఇటు సైన్యంతో చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజు వాళ్లు భారత్ వైపే అని ప్రకటించి తమ మార్గాన్ని చాటుకున్నారు. గత ఇరవైఐదు ఏళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 2000 నుంచి 2025 మార్చి వరకు దాదాపు 22,415 మంది మరణించినట్టు తెలుస్తున్నది. ఇందులో సాధారణ పౌరులు 4980 మంది, సైనిక బలగాల నుంచి 3623 మంది, ఉగ్రవాదులు, చొరబాటుదారులుగా భావించిన వాళ్లు 13,390 మంది, వివరాలు తెలియని వాళ్లు 422 మంది వున్నారు. ఇందులో ఎక్కువ మంది అంటే సైనిక బలగాలు మినహాయించి మిగతావాళ్లంతా కశ్మీరీలే. ఎన్నో కుటుంబాలు ఎందరినో కోల్పోయాయి. ఇదంతా కశ్మీరీల మెదళ్లను తొలుస్తున్నది.
గత కొంతకాలంగా కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. 2018 సంవత్సరంలో 228 ఉగ్రవాద దాడులు జరగగా, 2023లో అది 46కు తగ్గింది. పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. 2020లో 34 లక్షల మంది పర్యాటకులు కశ్మీర్‌కు రాగా, 2023లో అది 2 కోట్ల 35 లక్షలకు పెరిగింది. ప్రస్తుత సంవత్సరం కేవలం 26 రోజుల్లోనే 8 లక్షల 14 వేల మంది తులిప్ గార్డెన్‌ను సందర్శించారు. కశ్మీర్ పర్యాటక రంగం అక్కడి ప్రజలకు ప్రధాన జీవనాధారం. పదిహేను వేల హౌస్ బోట్స్ ఉన్నాయి. మూడు వేలకు పైగా హోటల్ గదులున్నాయి. లెక్కలేనన్ని వాహనాలు, వేలాది టూర్ గైడ్స్, ఇతర చిన్నచిన్న దుకాణాలు పర్యాటకం మీద ఆధారపడి జీవిస్తున్నారు. నిరుద్యోగం రేటు కూడా తగ్గింది. 2019 20లో నిరుద్యోగ రేటు 6.7 శాతం ఉండగా, 2023 24 లో అది 6.1కు పడిపోయింది. అయితే పహల్గాం దాడి తర్వాత దాదాపు 62 శాతం కుటుంబాలు కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నాయి. ఇది కశ్మీర్ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. అయితే టివి చానెల్స్‌లో మాట్లాడిన వాళ్లలో పర్యాటక రంగం గురించి మాట్లాడిన వాళ్లు ఉన్నారు. అయితే దానికి సంబంధం లేకుండా ఒక మానవత దృక్పథం మేరకు ఈ దాడిని ఖండిస్తున్నామని అన్న వాళ్లు కూడా ఉన్నారు.
కశ్మీర్ సమస్య ఈనాటిది కాదు. దీని మీద వందల పుస్తకాలు వచ్చాయి. ఎంతో మంది నివేదికలు రూపొందించారు. ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. కాని సమస్య కొలిక్కి రాలేదు. దీనికి కారణం పరిస్థితులే. కానీ ఈ రోజు పరిస్థితులు మారాయి. ముఖ్యంగా కశ్మీర్ ప్రజల్లో గతంలో పాకిస్థాన్‌తో ఉన్న స్నేహ దృక్పథం ఇప్పుడు పూర్తిగా పోయినట్టు కనిపిస్తున్నది.
కేంద్రం 2019లో 370 ఆర్టికల్ రద్దు చేసి కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తీసివేసిన తర్వాత కేంద్రం పట్ల కశ్మీర్‌లో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. అది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వ్యక్తమైంది. అయితే ఇప్పుడు వివాదాన్ని కశ్మీరీలు ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. నిన్న, మొన్న టివి చానళ్లలో మాట్లాడిన యువకులు, యువతులు కూడా దీనిని ప్రస్తావించి, దీనిని మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఆలోచిస్తామని చెప్పడం మంచి పరిణామం. అదే విధంగా భారతదేశంలోనే తాము భాగమని, పర్యాటక రంగం ద్వారా తాము జీవిస్తున్నామని, అది కూడా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల సహకారంతో తాము ఇక్కడ మనుగడ సాగిస్తున్నామని ప్రకటించడం కూడా ఆహ్వానించదగిందే.
అయితే ఇక్కడే ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని నిపుణులు, దౌత్యవేత్తలు భావిస్తున్నారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సంజయ్ కౌల్ ఈ విషయమై చాలా వివరమైన వ్యాసం రాశారు. భారతదేశం ఈ విషయంలో దృఢమైన వైఖరిని కలిగి ఉండాలి. రక్షణపరమైన చర్యలు చేపడుతూనే, విద్యా విధానంలో సమూలమైన మార్పులు, మతపరమైన సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి. అదే విధంగా ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వేదికలు, అవకాశాలు కల్పించాలి’ అంటూ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించారు.
ఇందులో మొదటి అంశాన్ని కేంద్రప్రభుత్వం చాలా తీవ్రంగానే తీసుకుంటున్నది. అనివార్యమైతే యుద్ధం దాకా కూడా భారత ప్రభుత్వం వెళ్లవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. మిగతా విషయాలను ప్రస్తుతం కాకపోయినా పరిస్థితులు చల్లబడిన తర్వాత ప్రభుత్వం అక్కడి ప్రజల మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుందని భావించవచ్చు. ముఖ్యంగా యువతలో నెలకొన్న నిరుద్యోగం, నైరాశ్యం గురించి ఆలోచించి పథకాలు రచించాలి.
అందులోనే సంజయ్ కౌల్ మరొక విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు కశ్మీరీ యువతకు బయటి ప్రపంచం గురించిన అవగాహన లేదు. చాలా మంది ఉగ్రవాదుల ఊబిలోకి వెళ్లి ఉన్మాదంతో విచక్షణను కోల్పోయినట్టు ఆయన తెలిపారు. అందుకే జీవితం పట్ల భరోసా, భవిష్యత్ మీద ఆశ కల్పిస్తే సరైన మార్గంలో యువత పయనించి శాంతి మార్గంలోకి వచ్చే అవకాశముంటుంది.
అదే విధంగా, కశ్మీరీలకు కూడా సంజయ్ కౌల్ ఒక సూచన చేశారు. ఇప్పటి వరకు చీకటిలో ఉన్న కశ్మీరీలకు ఇది ఒక చెడు అనుభవం. ఇప్పటికైనా ప్రపంచ గమనాన్ని అర్థం చేసుకొని శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించడానికి ముందుకు రావాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాలపట్ల నాకు ఏకీభావం ఉంది. అంతేకాకుండా ఆశాభావం కూడా ఉంది. ప్రభుత్వం ఒక వైపు ఉగ్రవాదాన్ని, పాకిస్థాన్ కుటిలత్వాన్ని ఎండగడుతూనే, రెండో వైపు ప్రజల్లో ప్రస్తుతం వచ్చిన మార్పుకు అనుగుణంగా చర్యలు చేపట్టి విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తే ఎవ్వరూ కూడా రక్తపాతం వైపు వెళ్లే అవకాశం ఉండదు.
ఇటీవల కశ్మీరీ యువతీ యువకుల్లో అన్ని ప్రాంతాల వాళ్లలాగా ప్రశాంత జీవనం గడపాలనే కోరిక బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. అటు ప్రభుత్వం, ఇటు కశ్మీరీ ప్రజలు శాంతి కోసం, ప్రజాస్వామ్యం కోసం అంతిమంగా దేశ సమగ్రత కోసం తమ తమ పరిధుల్లో సానుకూలంగా వ్యవహరిస్తే ఇటువంటి ఘోరాలలో ఇదే చివరిది కావచ్చు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాలి. ఎందుకంటే కశ్మీర్ భారత దేశం తలమానికం. అది కిరీటం లాంటిది, ఎంతో సుందరమైనది. అందమైనది. ఆహ్లాదమైనది. అది అందరిది కావాలి. కశ్మీర్‌లో శాంతికి, ప్రజాస్వామ్యానికి మనమంతా చేయూత నివ్వాలి.

– మల్లేపల్లి లక్ష్మయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News