రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కులా లు, సామాజిక వర్గాలు ఏకమవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారు అసంఘటిత వర్గాలుగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వారు ఏకం కాలేకపోతున్నారు. కొన్ని వృత్తులకు సంబంధించి సామాజిక వర్గాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉన్నా, ఉన్నత చదువులు చదువుకున్నా వారు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. మన దేశంలో అనేక కులావారు ఒకే వృత్తిలో ఉంటుంటారు. అటువంటి వారిలో ఐక్యతా లోపం వల్ల రాజకీయంగా మంచి స్థానాన్ని పొందలేకపోతున్నారు. అటువంటి వారిలో చేనేత సామాజిక వర్గాల వారు కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాలలో, దేశంలో గణనీయంగా ఉన్నా వారికి రాజకీయంగా తగిన స్థానం లభించడం లేదు. అయితే చేనేత కులాలలో ఉన్నత చదువులు చదివి దేశ విదేశాలలో ఆర్థికంగా స్థిరపడినవారు అనేక మంది ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులున్నారు.
చేనేతకు సంబంధించి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమి సెట్టిశాలి, సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగట శాలీలు, తొగుల వీరక్షత్రియ, కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాల, కుర్ని, ఖత్రి, నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్ వంటి దాదాపు 25 కులాల వారు మన దేశంలో ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి చేనేత. చేనేత వృత్తిగా ఉన్న వీరిలో కొన్ని కులాల వారికి తగిన గుర్తింపే లేదు.అందువల్ల రాజకీయంగా, సామాజికంగా తగిన స్థానం సాధించుకోవాలన్న తపనతో చేనేత వృత్తిగా గల ఈ కులాల వారినందరినీ కలపడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక కుల సంఘాలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చేనేత మూలాలున్న ఉన్నత విద్యావంతులు, మేధావులు కలిసి అంతర్జాతీయ చేనేత కార్మిక సంస్థ (వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్) ను ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా అమెరికాలోని డెట్రాయిట్, డల్లాస్, చికాగో, న్యూజెర్సీ వంటి నగరాలతో పాటు కెనడాలలో ఉండే వారు ఈ సంస్థను స్థాపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న, ఎన్‌ఆర్‌ఐ చేనేత కులాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం, ఒక బలమైన శక్తిగా రూపొందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. అలాగే, ప్రభుత్వాల సహకారంతో చేనేత కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం, చేనేత వర్గాలు ఆర్థిక, విద్య, సామాజిక, సాంస్కృతిక తదితర రంగాలలో నిలదొక్కుకోవడానికి సహాయ సహకారాలు అందించడం, చేనేత వృత్తిపై ఆధారపడిన వారి వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచి, వారికి కావలసిన పరికరాలు అందించడం, చేనేత వస్త్రాల మార్కెటింగ్, చేనేత కుటుంబాలకు వైద్యం, విద్య వంటి ముఖ్యమైన విషయాలలో సహకారం, విదేశీ విద్య, ఉపాధి, వ్యాపారం, వివాహాలు వంటి అంశాలలో సహకారం అందించాలన్న ఉత్తమ ఉద్దేశాలతో దీనిని స్థాపించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, భారతీయ ట్రస్ట్ సహకారంతో 2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పద్మశాలి భవన్‌లో వంద చేనేత కుటుంబాలకు ఆసు యంత్రాలను ఈ సంస్థ అందించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంలో ఈ సంస్థ ఉంది. గత డిసెంబరు 10న తిరుచిరాపల్లిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ తమిళనాడు శాఖను ఏర్పాటు చేశారు. దేశంలోని చేనేత సామాజిక వర్గాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించేందుకు ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసిద్ధ చేనేత కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సదస్సు- 2023ని నిర్వహించనున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల చేనేత సామాజిక వర్గాలకు చెంది కుల సంఘాల ప్రముఖ నేతలను, రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులతో పాటు విదేశాలలో ఉండేవారిని కూడా ఆహ్వానించారు. ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పి. నరహరి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, ఎల్. రమణ, పంచుమర్తి అనురాధ, పోతుల సునీత, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, రాపోలు ఆనంద భాస్కర్, నిమ్మల కిష్టప్ప, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఎన్‌ఆర్‌ఐలు అంజన్ కర్నా టి, రమేష్ మునుకుట్ల, రాజ్ అడ్డగట్ల, సారథి కార్యంపూడి వంటి వారు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. చేనేత కులాల మధ్య ఐక్యత, అన్ని అంశాలలో పరస్పర సహకారం, రాజకీయంగా ఒక బలమైన శక్తిగా ఎదగడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. చేనేత కార్మికులకు అన్ని విధాల సహాయపడటంతో వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేనేత వర్గాలకు అధిక సీట్లు సాధించుకోవాలన్నది ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.
-శిరందాసు నాగార్జున, 9440222914.