Saturday, December 21, 2024

వార్ రూంలో వాగ్యుద్ధం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా ముగిసింది. ఢిల్లీ వేదికగా శుక్రవారం సుమారు ఐదుగంటల పాటు సాగిన ఈ సమావేశం సాయంత్రం ముగిసింది. అయితే ఈ సమావేశంలో భాగంగా టికెట్ కేటాయింపులపై వార్ రూంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగినట్లుగా సమాచారం. అయితే పిసిసి రేవంత్‌రెడ్డి అధ్యక్షుడు ఒక అభ్యర్థి పేరు చెబితే ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు తెలంగాణకు చెందిన నేతలు వేరే పేర్లను స్క్రీనింగ్ కమిటీకి చెప్పడంతో ఆ సమావేశంలో చాలాసేపు తీవ్రస్థాయిలో వా గ్యుద్ధం జరిగినట్లు తెలిసింది. మొత్తంగా 30 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో స్క్రీనింగ్ కమిటీ ఏకభిప్రాయానికి రాగా మిగతా అభ్యర్థుల విషయంలోనే పలువురు నాయకుల మధ్య కొంత వాదోపదాలు జరిగినట్టుగా తెలిసింది.

అయితే ఈ వాడివేడి చర్చల్లో రేవంత్‌రెడ్డి ఒక్కరే ఒకవైపు ఉండడం ముగ్గురు నేతలు ఒక వైపు ఉండడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో స్క్రీనింగ్ కమిటీ కొం త సందిగ్ధత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అందులో భాగం గా మరోమారు ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే ఇలా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలోనూ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయబోయే 30 మంది అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. కాగా, అభ్యర్థుల ఎంపికపై గురు, శుక్రవారా ల్లో స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. 60 శాతానికి పైగా ఏకాభిప్రాయంతో 30 అభ్యర్థుల జాబితా కొలిక్కి రాగా, 40 శాతం అభ్యర్థుల జాబితాపై మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా ఈ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయనుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చైర్మన్ మురళీధరన్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీ ఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా కీలక నేతలంతా పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (కేంద్ర ఎన్నికల కమిటీ)కి పంపుతామని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలా, లేదా పూర్తి జాబితాను ఒకేసారి విడుదల చేయాలా అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్క్రీనింగ్ కమిటీ సత్వరమే పూర్తి చేసి, పూర్తి జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదానికి పంపుతామని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి వరకు, శుక్రవారం సుమారు 8 గంటల పాటు ఏకధాటిగా స్క్రీనింగ్ కమిటీ సమావే శంలో సమాలోచనలు జరిగాయన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితాను ఈరోజే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆమోదానికి పంపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. గురు, శుక్రవారాల్లో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అన్ని అంశాలపై చర్చ జరిగిందని, సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు చర్చలు జరుపుతున్నామని మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. ఆశావహులు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని, అందరి బయోడేటాలు ( పూర్తి వివరాలు) మా దగ్గర ఉన్నాయని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని మాణిక్ రావు ఠాక్రే వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News