Monday, December 23, 2024

గడ్డి పరకలను గడ్డపారలుగా మార్చిన యోధుడు

- Advertisement -
- Advertisement -
దైవాంశ సంభూతుడు అల్లూరి
భగత్‌సింగ్ వంటి గొప్పవీరుల సరసన తెలుగు నేల నుంచి ఆయన పేరు చిరకాలం నిలుస్తుంది
తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను స్ఫూర్తి పొందాను : ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలమీద పీడన దోపిడీ వి పరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో దైవాంశ సంభూతులు పుడతారని, ‘సంభవావి యుగే యుగే’ అని గీతాచార్యుడు చెప్పిన మాటలు, 26 ఏండ్ల అతిపిన్న వయస్సులోనే రవి అ స్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడై న అల్లూరి సీతారామరాజు జీవితానికి నిజంగా వర్తిస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. స్వేచ్ఛావాయువులు పీల్చుతూ స్వయం పాలన  కోసం సాగిన స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి గొప్ప స్పూర్తిని రగిలించారని సిఎం అన్నారు. అల్లూరి స్పూర్తిని తెలిపే గీతాలను వింటూ తాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో స్పూర్తిని పొందానని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో పోరాడి అసువులు బాసిన భగత్ సింగ్ వంటి గొప్ప వీరుల సరసన తెలుగునేల మీదనుంచి అల్లూరి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల నిర్వాహకులయిన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులను సిఎం కెసిఆర్ వేడుకల ముగింపు సందర్భంగా అభినందించారు.

క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు వేడుకల కార్యక్రమం ఆద్యంతం గొప్పగా సాగింది. సమావేశం సాగినంత సేపు అల్లూరి వీర గాథను స్పురింపచేసే కార్యక్రమాలు డాక్యుమెంటరీలు సభికుల్లో దేశభక్తి భావాన్ని రగిలించాయి. జై భారత్ నినాదాలు మారు మోగాయి. తొలుత వేదికకు చేరుకుంటున్న సిఎం కెసిఆర్‌కు సభికులు హర్హధ్వానాలతో, చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమ నిర్వాహకులు సిఎంను సాదరంగా స్వాగతించారు. పరిత్రాణాయ సాధూనాం..వినాశాయ చ దుష్కృతామ్..ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పినట్టు…ఎక్కడైతే పీడన, దోపిడి ప్రజల మీద ఎక్కువగా పెరుగుతుందో అక్కడ దైవాంశసంభూతులైన మహామహులు ఉద్భవించి పీడనకు కారకులైన వారిని అంతం చేసి, శాంతి కలుగజేస్తారని పేర్కొన్నారు. బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకొని భరతజాతి నలిగిపోతున్న వేళ విప్లవజ్యోతియై అవతరించిన వీరయోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.
గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహాయోధుడు అల్లూరి
అన్నెం పున్నెం ఎరుగని మన్నెం బిడ్డల కన్నీరు తుడిచి, గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహాయోధుడు అల్లూరి అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఆయన భారతమాత గర్వించే ఉత్తమ తనయుడూ, నిర్మల దేశభక్తుడూ, నిజమైన యోగిపుంగవుడూ అని కొనియాడారు. ఆ మహనీయుని 125వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించటం యావజ్జాతి కర్తవ్యం అని వ్యాఖ్యానించారు.ఆ కర్తవ్యాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన తెలంగాణ ఆంధ్ర క్షత్రియ సేవా సమితిని సిఎం అభినందించారు. ఈ ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు పోరాట చైతన్యాన్నీ, దేశభక్తినీ కొత్త తరానికి ఘనంగా చాటిచెప్పాయని అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం ముదావహం..సముచితం అని పేర్కొన్నారు. ఇంతటి ఉత్తమోత్తమమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులు నాగరాజు చెప్పినట్టు, కృష్ణగారు అల్లూరి సీతారామ రాజుగారు సినిమా నిర్మించి ఉండకపోతే, అందులో మహాకవి శ్రీశ్రీ రాసిన తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా ! మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా అనే పాట చాలా పాపులర్ అయిందని తెలిపారు. అల్లూరి ప్రేమికులందరూ కూడా ఈ పాట నిరంతరంగా వింటూనే ఉంటారన్నారు. ఉద్యమ సందర్భంలో చాలాసార్లు తన కారులో ఈ పాట పెట్టుకొని వినేవాడిని అని గుర్తు చేసుకున్నారు. మార్జినలైజ్డ్ సెక్షన్స్ మీద ఎప్పుడైతే దాడి సంభవిస్తుందో, అప్పుడు కొందరు వీరులు ఉద్భవించి వారికి శాంతి కలుగజేస్తారని వ్యాఖ్యానించారు.
అల్లూరిది చాలా గొప్ప చరిత్ర
అల్లూరిది చాలా గొప్ప చరిత్ర అని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. చాలా చిన్న వయసులో అంత గొప్ప ప్రేరణ వారికి ఎలా కలిగిందో, అందుకే ఆయన దైవాంశసంభూతుడు అని తాను చెప్పానని అన్నారు. అంత పిన్న వయసులో అల్లూరి ప్రజలు పడే బాధలు భరించలేక వారు యుద్ధరంగంలోకి దూకి, 26 సంవత్సరాల కాలంలోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్న గడగడలాడించిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి యోధుల సరసన, తాము తక్కువ కాదు అని మన తెలుగు జాతిని నిలబెట్టిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. తాము తక్కువ కాదని నిరూపించిన వారి త్యాగనిరతి, చివరికి చనిపోతూ కూడా దేశం గురించే మాట్లాడి, దేశం గురించే ప్రాణాలర్పించారని చెప్పారు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే, వేలకొద్దీ సీతారామరాజులు వస్తారని, ఇది ఆగే పోరాటం కాదనే అల్లూరి సీతారామరాజు మాటలను కిషన్ రెడ్డి బాగా చెప్పారని ప్రశంసించారు.మన త్రివర్ణ పతాకం గగనంలో రెపరెపలాడుతుంటే చాలా గొప్పగా దేశమంతా పరవశించిన సన్నివేశం మనం ఎప్పుడూ మరిచిపోలేమని తెలిపారు.మహాత్మగాంధీ అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించినా, అల్లూరి సీతారామరాజును తాను ప్రశంసించకుండా ఉండలేను అని ఇచ్చిన స్టేట్ మెంట్ రికార్డుల్లో ఉందని వివరించారు. అటువంటి మహానీయుడు చేసిన పోరాటం వల్ల మనం ఈ రోజు గౌరవంగా, సమున్నతంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతుత్సవాలను చేపట్టి,ఆయనకు తగిన గౌరవాన్ని కల్పించిన మిత్రులు కిషన్ రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి తెలుగుజాతి ప్రజలందరి తరఫున సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

నిర్వహక కమిటీ అధ్యక్షుడు పెరిచెర్ల నాగరాజు ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైన సభ, వరుసగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సిఎం కెసిఆర్‌ల ప్రసంగాలు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశంతో ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం జయంతి వేడుకలు ముగిసాయి. అనంతరం తన ఒక్కరోజు హైద్రాబాద్ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఎం కెసిఆర్ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్, దామోదర్ రావు, ఎంఎల్‌ఎలు జీవన్ రెడ్డి, జాజల సురేందర్,పెద్ది సుదర్శన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్య, మర్రి జనార్థన్ రెడ్డి, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కె. నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, చైర్మన్లు అంజనేయ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన రాష్ట్రపతి
గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి చరిత్రను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలించారు. అనంతరం రాష్ట్రపతి వేదికపైకి చేరుకోగా, ఆమెకు స్వాగతం పలుకుతూ హాలంతా చప్పట్లతో మారుమోగింది. అనంతరం ఇతర ముఖ్య అథితులతో పాటు సిఎం కెసిఆర్ జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజల్వన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహుకులు రాష్ట్రపతితో సహా సిఎం కెసిఆర్‌తో పాటు హాజరైన ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. విగ్రహ రూపశిల్పి బుర్రా ప్రసాద్, విగ్రహదాత అల్లూరి సీతారామ రాజు సహా పలువురిని నిర్వాహకులు సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News