Sunday, November 17, 2024

కులగణనపై త్వరలోనే మేధావులతో వర్క్ షాప్

- Advertisement -
- Advertisement -

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కులగణన చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కాంగ్రెస్ ప్రభుత్వం బిసిల ఆకాంక్షలను నెరవేర్చి బిసిల మనోభావాలను గౌరవించిందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చారిత్రకమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సిఎం మల్లు బట్టి విక్రమార్క, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించాలని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా , నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బిసి కులగనణ సాధన విజయోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అందులో భాగంగానే హైదరాబాదులోని అలీ కేఫ్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బిసి సంఘాల నేతలతో కలిసి జాజుల జ్యోతిబాపూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విగ్రహం వద్ద వివిధ వృత్తులు చేసుకునే బిసి కులాల వారికి మిఠాయిల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిసి కులాల లెక్కలు తీయాలని బిసిలకు రాజ్యాంగబద్ద హక్కులు కల్పించాలని తాము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని, బిసిల పోరాటాలను, బిసిల ఆకాంక్షలను గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో సమగ్ర కులగనణ చేపడుతామని తీర్మానం చేసిందని పేర్కొన్నారు.

సమగ్ర కులగణన తోనే బిసిలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అసెంబ్లీ తీర్మానంతో బిసి కులాల లెక్కలకు చట్టబద్ధత కలుగుతుందన్నారు, అసెంబ్లీ తీర్మానాన్ని రాజకీయం చేయకుండా బిసిలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించడానికి మంత్రివర్గ తీర్మానం, అసెంబ్లీ తీర్మానం ఉంటే సరిపోతుందని, చట్టం చేయాల్సిన అవసరం లేదని జాజుల అన్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చట్టం చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బిసి కుల లెక్కింపు ప్రారంభం నుండి ముగించే వరకు బిసిలంతా రాజకీయ పార్టీలకతీతంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు త్వరలోనే కులగణనపై బిసిలలో సామాజిక చైతన్యం అవగాహన పెంపొందించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర, మండల కేంద్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలు రూపొందించనున్నందున బిసి సంక్షేమ సంఘం తరఫున సలాహాలు, సూచనలు ఇవ్వడానికి రెండు మూడు రోజుల్లోనే బిసి విద్యావేత్తలతో, మేధావులతో సమగ్ర కులగణన అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ఎంబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ టి. బడేసాబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. మని మంజరి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం, కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ అధ్యక్షులు మాదేశి రాజేందర్, మహిళా నాయకురాలు స్వర్ణ గౌడ్ తారకేశ్వరి నాయకులు మహేష్ బిక్షపతి చారి కందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Caste census 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News