కాబుల్: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడి సోమవారం నాటికి ఏడాదయ్యింది. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున అఫ్ఘాన్ రాజధాని కాబుల్ నగరాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత దేశంలో వేగంగా పరిణామాలు మారిపోయి మళ్లీ అఫ్ఘాన్ ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకోవడమేగాక సాంప్రదాయక తాలిబన్ల కబంధ హస్తాల్లో విలవిలలాడుతోంది. దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుని ఏడాది అవుతున్న సందర్భంగా తాలిబన్ యోధులు సోమవారం నగర వీధుల్లో విజయోత్సవ ఊరేగింపులు నిర్వహించారు. కాలినడకన, సైకిళ్లు, బైకుల పైన గుంపులుగా తిరుగుతూ ఇస్లాం అనుకూల, అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. ఏడాది క్రితం జరిగిన పరిణామాలతో అఫ్ఘాన్ అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోయింది. ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక సాయం తగ్గిపోవడంతో ఆర్థిక స్థితి పతనమై లక్షలాది మంది అఫ్గాన్లు దారిద్యంలో కూరుకుపోయారు. బాలికల విద్య, ఉద్యోగాలపై తాలిబన్లు ఇచ్చిన మాటను తప్పడంతో బాలికలు స్కూళ్లు, కాలేజీలకు దూరమయ్యారు. మహిళలు తమ కళ్లను తప్ప మిగతా శరీరమంతా వస్త్రంతో కప్పుకుని బయట తిరగాలని తాలిబన్లు విధించిన ఆంక్షలతో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళలు అనేక ఇక్కట్లను ఎదుర్కోవలసి వస్తోంది.