Monday, December 23, 2024

మధుసూదన్ సూత్రధారి

- Advertisement -
- Advertisement -

రిమాండ్ రిపోర్టులో ఎ-1గా గుర్తింపు, అరెస్టు
పరారీలో మరో10 మంది
15 కోచింగ్ సెంటర్లపై సిట్ విచారణ
సుబ్బారావుపై లభించని సాంకేతిక ఆధారాలు
రెచ్చగొట్టే సందేశాలు పంపినందుకు
అదుపులోకి తీసుకోనున్న సిట్
సాయి డిఫెన్స్ అకాడమీలో కేంద్ర
ఇంటిలిజెన్స్ తనిఖీలు
చంచల్‌గూడ జైలు వద్ద నిందితుల బంధువుల ఆవేదన

సికింద్రాబాద్ ఘటనలో తేల్చిన పోలీసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు పక్కా ప్రణాళికతోనే విధ్వంసం సృష్టించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లకు కామారెడ్డి వాసి మధుసూదన్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఎ1గా కామారెడ్డి వాసి మధుసూదన్ పలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి 17వ తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెట్రోల్ బాటిళ్లు, కర్రలతో చేరుకుని విధ్వంసానికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. ఈక్రమంలో 17వ తేదీ ఉదయం 8.30 గంటల సమయంలో గేట్ నంబర్ 3 నుంచి ప్లాట్ ఫాం- నం.1కి చేరుకొన్న ఆందోళన కారులు రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు, ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాళ్లను ధ్వంసం చేశారని వివరించారు. ఆ తర్వాత మూడు రైళ్లలోని నాలుగు బోగీలకు నిప్పు పెట్టారని, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తేలిందన్నా రు.

ఈ అల్లర్లకు సంబంధించి 56 మందిని నిందితులుగా చేర్చామని వారిలో 46 మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. డిఫెన్స్ అకాడమీలకు చెందిన కొంతమంది నిర్వాహకులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చామని, ఈ విధ్వంసం వల్ల రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సికింద్రాబాద్ రైల్వే డిఎస్‌పి నర్సయ్య 18 మంది సాక్షులను విచారించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈకేసులో ప్రధాన నిందితుడితో పాటు ఎ13 నుండి ఎ56 వరకు అరెస్టయ్యారని, ఎ2 నుండి ఎ12 వరకు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులోని 56 మంది నిందితులు ఫిజికల్, మెడికల్ ఫిట్‌నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారని, అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్  క్రేయేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీమ్ పెట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్స్, ఛలో సికింద్రాబాద్ ఎఆర్‌వొ3 గ్రూప్, ఆర్మీ జిడి 2021 మార్చ్ ర్యాలీ గ్రూప్, సిఇఇ సోల్జర్ వాట్సాప్ గ్రూ పులను అభ్యర్థులు క్రియేట్ చేశారని తెలిపారు. ఈ గ్రూప్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలని ముందస్తు ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అభ్యర్థులకు పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విధ్వంసానికి చేసుకున్న ప్లాన్‌లో భాగంగా ఉదయం 8.30 నిమిషాలకు కలవాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.ఆత్మరక్షణ కోసమే పోలీసులు నిరసన కారులపై కాల్పులు జరిపారని పోలీసులు రిపోర్టులో ప్ర స్తావించారు. కాల్పుల్లో బులెట్ తగిలి రాకేష్ మృతి చెం దగా, మరో 12 మందికి గాయాలయ్యాయని తెలిపారు.

15 కోచింగ్ సెంట్లరపై సిట్ విచారణ

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సిట్ పోలీసులు దర్యా ప్తు ముమ్మరం చేశారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లలో హైదరాబాద్‌లోని 6 అకాడమీల మేనేజర్లు పాత్ర ఉన్నట్లు సిట్ పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అలాగే 15 కోచింగ్ సెంటర్ల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్న సిట్ పోలీసులు కోచింగ్ సెంటర్ల పా త్రపై ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా హైదరాబా ద్, విజయవాడ, గుంటూరు కోచింగ్ సెంటర్లపై నిఘా పెట్టడంతో పాటు ఆయా కోచింగ్ సెంటర్ల యజమాను వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గుంటూరు చేరుకున్న సిట్ అధికారుల బృందం మొత్తం 15 కోచింగ్ సెంటర్ల పాత్రపై విచారణ చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లు నడుపుతున్నదెవరు? రెచ్చగొట్టిందెవరు అన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

ముఖ్యంగా సాయి డిఫెన్స్ అకాడమీ మేనేజర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు 12 ప్రాంతాలలో సాయి డిఫెన్స్ అ కాడమీల కార్యకలాపాలపై విచారణ చేపడుతున్నారు. సాయి డిఫెన్స్ అకాడమీ మేనేజర్ల ద్వారా ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సాయి డిఫెన్స్ అకాడమీ ఛైర్మన్ ఆవుల సుబ్బారావు పై ఆరోపణలు రావడంతో అతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సాంకేతిక ఆ ధారాలు లభించకపోవడంతో సుబ్బారావుపై కేసు నమో దు చేయాలేదని ఎపి పోలీసులు పేర్కొంటున్నారు. అయి తే సికిందరాబాద్ అల్లర్ల వెనుక రెచ్చగొట్టే సందేశాల మేరకు సిట్ పోలీసులు సుబ్బారావును అదుపులోకి తీసుకోనున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంలో గాయపడి ఆసుపత్రిలో కోలుకున్న 9మంది ఆర్మీ అభ్యర్ధులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. అదేవిధంగా ఘటనలో గాయపడిన మరో నలుగురు ఇంకా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

కేంద్ర నిఘా వర్గాల ఆరా..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేపడుతున్నాయి. సికిందరాబాద్‌లో విధ్వంసానికి నిర్థ్దిష్ట కారణాలను తెలుసుకోవడంతో పాటు ఇందుకు బాధ్యులు, ఆందోళనలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు కేంద్ర నిఘా సంస్థతో పాటు రక్షణ మం త్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. సికిందరాబాద్ ఘటనతో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యే ప్రమాదముందనే కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలోరాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది.

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలపై రాష్ట్ర పోలీసులు దృష్టిసారించడంతో పాటు అకాడమీ నిర్వాహకుల కదలికలపై నిఘా పెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లలో పోలీస్ స్టేషన్ల వారీగా అకాడమీ నిర్వాహకుల వివరాలను సేకరించారు. ప్రస్తుతం అకాడమీలలో ఎంత మంది అభ్యర్థులు శిక్షణపొందుతున్నారు? రక్షణశాఖ ఇటీవల రద్దు చేసిన సైనిక నియామక ర్యాలీలో ఎంత మంది అర్హత సాధించారు? అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఎవరైన మాట్లాడుతున్నారా? అన్న అంశాలపై కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.అదేవిధంగా ఈ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో వాటిపైనా కేంద్ర నిఘా సంస్థ, రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నిఘా విభాగానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడ్డవారిని గుర్తించేందుకు సిసి కెమెరా దృశ్యాలు, వివిధ మీడియాల్లో ప్రచురితమైన ఫొటోలు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన దృశ్యాలను కేంద్ర నిఘా విభాగం అధికారులు సేకరిస్తున్నారు.

సాయి అకాడమీలో కేంద్ర ఇంటెలిజెన్స్ తనిఖీలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లపై కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఎపిలోని పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీలో కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని దస్త్రాలు పరిశీలించిన అధికారులు సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు. నరసరావుపేటలో దాదాపు పదేళ్లుగా సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఇంటెజెన్స్‌అధికారులు గుర్తించారు.

వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌లపై విచారణ

సికింద్రాబాద్ అల్లర్లతో సంబంధం ఉందని భావిస్తున్న వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సభ్యులను అడ్మిన్లు రెచ్చగొట్టేలా పోస్టింగులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరాదిలో విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ఆందోళనకారుల వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు యువకులను రెచ్చగొట్టిన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏయే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తును క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు సిపి, టాస్క్‌ఫోర్స్ డిసిపికి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాలిచ్చారు. విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన నిందితుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చంచల్‌గూడ జైలుకు చేరుకొని ములాఖత్లో వారి పిల్లలను కలుసుకున్నారు. ములాఖత్ కోసం ఇప్పటికే 300మంది కుటుంబ సభ్యులు రిజిస్టర్ చేసుకున్నారు.

నిరసనలతో 612 రైళ్లు రద్దు

న్యూఢిల్లీ : అగ్నిపథ్‌కు వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో సోమవారం దేశవ్యాప్తంగా 612 రైళ్లు రద్దయ్యాయి. పలు ప్రాంతాలలో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. నిలిపివేసిన రైలు సర్వీసులలో 223 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 379 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని రైల్వే వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. నాలుగు మొయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను , ఆరు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. అగ్నిపథ్ నిరసనలతో తూర్పు మధ్య రైల్వేలోని పలు రాకపోకలపై ప్రభావం పడింది. ఈ జోన్‌లో 350 ట్రైన్లను రెండు మూడు రోజుల నుంచి నిలిపివేయడం జరిగింది. అదే విధంగా ఈ రూట్లలో వెళ్లే ఇతర జోన్లకు చెందిన రైళ్లకు కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News