శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రీ రిలీజ్ వేడుకలో చిత్రం టైటిల్ సాంగ్‌ను వ్యాపారవేత్త రాజ సుబ్రమణ్యం, కెమెరామెన్ సుజిత్ సారంగ్ సంయుక్తంగా ఆవిష్కరించారు. మరో గీతాన్ని ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నేని, వెంకట్ బోయినపల్లి కలిసి ఆవిష్కరించారు. సినిమా ట్రైలర్‌ను ముఖ్య అతిథులు విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్, కీర్తిసురేష్, సాయిపల్లవి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ “అందమైన నాయికలు రష్మిక, సాయిపల్లవి, కీర్తిసురేష్ అద్భుతంగా నటిస్తారు.
వీరికి సమంత గ్యాంగ్ లీడర్. సాయిపల్లవి లేడీ పవన్‌కళ్యాణ్‌లా కనిపిస్తారు. దర్శకుడు కిషోర్ చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి. మంచి సినిమాకు ఇది స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నా. శర్వాకు నేను అభిమానిని. అతను గత రెండు సినిమాల్లో సీరియస్‌గా కనిపించాడు. కానీ ఈ సినిమాలో నవ్వుతూ బాగా చేశాడు. అందులోనే హిట్ కళ కనిపిస్తుంది”అని అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ “ఈ సినిమాకు దేవిశ్రీ తన పాటలతో ప్రాణం పోశాడు. ఈ సినిమాలో గొప్ప నటులతో కలిసి నటించే అవకాశం కలిగింది. మంచి ఫ్యామిలీ సినిమాను ప్రేక్షకులకు ఇస్తున్నాం”అని తెలిపారు. దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ ఫ్యామిలీ అంతా కలిసి చూసే వినోదాత్మక చిత్రమిదని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ “దర్శకుడు కిషోర్ తన చిత్రాల్లో ఎమోషన్స్ ఉంటూనే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండేలా చూసుకుంటారు. శర్వాకు ఇది బెస్ట్ ఫిలిం అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్న, కుష్బూ, సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.