Friday, November 15, 2024

పేదల ఓటు భద్రమేనా!

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india

ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ఏ మంచిని కోరి చేపట్టామని ప్రధాని మోడీ ప్రభుత్వం చెబుతున్నదో అంతకు మించి చెడు జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదన త్రోసిపుచ్చదగినది కాదు. ఈ చట్టం అంతిమంగా పేదలను పోలింగ్ కేంద్రాలకు దూరం చేసి కేవలం చదువుకున్న వారి ప్రాతినిధ్యం కలిగిన చట్ట సభలను ఆవిష్కరించడానికి తోడ్పడుతుందనే భయం కలగడం సహజం. దొంగ ఓట్లను తొలగించడానికి ఓటరు కార్డుతో ఆధారు అనుసంధానం ఉపయోగపడుతుందని భావించి ఈ చట్టాన్ని తెచ్చినట్టు కేంద్రం చెబుతున్నది. పేదలు, నిరుపేదలు అధికంగా గల దేశంలో ఆధార్ గుర్తింపు కార్డు లేని వారు అసంఖ్యాకంగా ఉండే అవకాశం వుంది. ఈ లోపాన్ని సవరించకుండా ఆధార్ అనుసంధానానికి పోవడం వల్ల అవి లేని పేదలు ఓటు హక్కు కోల్పోతారు. అప్పుడు ఎన్నికలు ఒక ప్రహసనంగా ఇప్పటి కంటే అధ్వానంగా ఆషామాషీగా మారిపోయే ప్రమాదముంది. ఈ ఏడాది జూన్ 21 నాటికి దేశంలోని వయోజనుల (18 ఏళ్ళు దాటిన వారు )లో 99 శాతం మందికి ఆధార్ కార్డులు అందినట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ప్రకటించింది, అంటే 129.48 కోట్ల మందికి ఆధార్ ఇచ్చినట్టు తెలియజేసింది. అందులోని వాస్తవం ఏమైనప్పటికీ మొత్తం మైనారిటీ తీరినవారందరికీ ఆధార్ ఇవ్వలేదని బోధపడుతున్నది.

ఇలా ఇంకా ఆధార్ లేనివారు యుఐడిఐఎ ప్రకారమే కొన్ని లక్షల మంది ఉండే అవకాశముంది. ప్రస్తుతానికి అనుసంధానాన్ని ఓటరు యిష్టానికి వదిలేసినప్పటికీ భవిష్యత్తులో దానిని తప్పనిసరి చేయరనే హామీ లేదు. అనుసంధాన నిబంధనల ప్రకారం వీరి ఓటు కార్డులు చెల్లకుండాపోతాయి. అలాగే ఆధార్ కార్డులు అందుకున్నవారిలో ఎంతమంది వద్ద అవి సురక్షితంగా ఉన్నాయో, అవి పోయి ఉంటే వాటి నంబర్లనైనా కాపాడుకున్నారో లేదో ఆ పరిజ్ఞానం వారికి ఉండే అవకాశం ఉందో లేదో తెలీదు. నకిలీ (ఫేక్) ఆధార్ కార్డులు కూడా అసంఖ్యాకంగా వున్నట్టు తెలుస్తున్నది. పేదల్లో అత్యధికులు నిరక్షరాస్యులే, స్థిర నివాసాలున్నప్పటికీ ఉపాధి కోసం దూరప్రాంతాలకు వలసపోయేవారే ఎక్కువగా ఉంటారు.

వారు తమ వెంట ఆధార్‌ను తీసుకు వెళ్లే అవకాశాలు తక్కువ. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్నది వూడిపోయిందన్నట్లు దొంగ ఓట్లను అడ్డుకోడానికి చేసిన ప్రయత్నం ఉన్న ఓట్లను ఊడబెరికి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం పాలు చేస్తుందనే ప్రతిపక్షాల భయం సబబైనదే. జస్టిస్ ఎఎం ఖన్విల్కర్ సారథ్యంలోని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్‌ఎ నజీర్, బిఆర్ గవాయ్, ధనంజయ్ వై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనంలో మిగతా నలుగురు ఆధార్ చట్టబద్ధతను అంగీకరించగా, చంద్రచూడ్ వ్యతిరేక తీర్పును ప్రకటించారు. ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా పేర్కొని లోక్‌సభ ఆమోదంతో చట్టం చేయడంలోని మంచి చెడులను మరింత విస్తృత ధర్మాసనం నిర్ధారించాలని జస్టిస్ చంద్ర చూడ్ ప్రత్యేక ఉత్తర్వులో అభిప్రాయపడ్డారు. అయిదుగురి జడ్జీల ధర్మాసనం మెజారిటీ తీర్పు ఆధార్ చట్టబద్ధతను ధ్రువపరుస్తూనే గోప్యత హక్కు దృష్టా ఆ కార్డు గలిగిన వ్యక్తి అంగీకారం అవసరమని చెప్పింది. అందుచేతనే ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసే చట్టంలో ప్రభుత్వం దానిని ఐచ్ఛికం చేసింది. అంటే పౌరులు తమ యిష్ట ప్రకారమే ఆధార్‌తో ఓటరు కార్డును అనుసంధానం చేసుకోవచ్చు.

ఇష్టం లేకపోతే మానుకోవచ్చు. అయినా వ్యక్తుల యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పేదల చేత తాము కోరుకొన్న చోట వేలిముద్రలు వేయించి, సంతకాలు చేయించుకొనే వారికి కొదువలేదు. అందుచేత చట్టంలో తగిన రక్షణలు కల్పించాలి. మరోవైపు ఆధార్ వినియోగం అన్ని చోట్లా ఆవశ్యకం కాదు. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్‌కు చట్టబద్ధత కల్పించినప్పటికీ బ్యాంకు ఖాతాల కోసం, ఫోన్ కనెక్షన్లకు దానిని చూపించనక్కరలేదని స్పష్టం చేసింది.

ఆధార్ వినియోగాన్ని కేవలం ప్రభుత్వం సంక్షేమ పథకాలకే పరిమితం చేయాలని కూడా సూచించింది. 2020 మార్చిలో సిబ్బంది, ప్రజల ఫిర్యాదులు, చట్టం, న్యాయం సంబంధిత పార్లమెంటు స్థాయీ సంఘం ఈ విషయమై సమావేశమైంది. ఓటరు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయడం అనే అంశంపై ఆ కమిటీ పరిశీలన జరిపినప్పుడు అందులోని ప్రతిపక్ష సభ్యులెవరూ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తున్నది. అయితే ఆ విషయాన్ని ఆ సభ్యులతో ప్రస్తావించినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణం చెప్పి తమను సమర్థించుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన సభ్యుడు ఈ సందర్భం తనకు గుర్తు లేదని అన్నారు. తన ఊరు జబల్‌పూర్‌లో తనకు ఓటరు కార్డు వుందని తాను ఢిల్లీలో వుంటున్నానని తన ఆధార్ కార్డు ఢిల్లీలోనే వుందని అటువంటప్పుడు తన ఓటరు కార్డుతో ఢిల్లీలోని ఆధార్ కార్డును ఎలా అనుసంధానం చేస్తానని పశ్నించారు. అందువల్ల ప్రతిపక్షం ఇప్పుడు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను త్రోసిపుచ్చనవసరం లేదు. వారి భయానుమానాలను గమనంలో వుంచుకొని చట్టానికి తగు సవరణలు తీసుకు రావలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News