త్వరలో నిబంధనలు: రిటైర్ దశలో సిఇసి వెల్లడి
న్యూఢిల్లీ : ఎన్నికలలో ఓటర్ల ఓట్లు వివరాలతో కూడిన ఎలక్టోరల్ జాబితాతో ఆధార్ అనుసంధాన ప్రక్రియపై నిబంధనలను త్వరలో వెలువరిస్తారు. ఓటర్లు తమ ఆధార్ వివరాలను పొందుపర్చడం స్వచ్ఛందం అని ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర శనివారం తెలిపారు. ఎలక్టోరల్ రోల్స్ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకం. ఎన్నికల సమగ్రతకు ఇవి ప్రధానం అని ఆయన వివరించారు. ఇక ఓటర్లు తమకు ఇష్టం ఉంటే ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానానికి దిగవచ్చు. ఇందులో బలవంతం ఏమీ ఉండదు. అయితే ఈ లింక్‌కు దిగని వారు అందకు తగు కారణాలను వివరించాల్సి ఉంటుంది. శనివారం సాయంత్రమే సిఇసి బాధ్యతల నుంచి సుశీల్ చంద్ర తమ రిటైర్మెంట్ కారణంతో వైదొలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రక్రియ తీసుకోబోయే మార్పులు చేర్పులను వివరించారు.
ఈ ఏడాది మార్చిలో దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాలలో కొవిడ్ టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషించిందని చంద్ర తెలిపారు. తమ పదవీ కాలంలో రెండు ప్రధాన ఎన్నికల సంస్కరణలు జరిగాయని వివరించారు. 18 సంవత్సరాలు వచ్చిన వారు ఓటర్లుగా నమోదు చేసుకునే ప్రక్రియలో వెసులుబాట్లు కల్పించినట్లు, ఇంతకు ముందు కేవలం ఒక తేదీని ఖరారు చేసి, ఈ గడువు ముగిసిన తరువాత మరోసారి వారి పేర్ల నమోదుకు అవకాశం ఇచ్చే వారు కాదు. అయితే ఈ పద్ధతిని మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ వయస్సు వారికి పేర్లు నమోదు చేసుకునేందుకు నాలుగు సార్లు అవకాశం కల్పించినట్లు, దీని వల్ల ఎక్కువ మంది తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలేర్పడినట్లు తెలిపారు. సుశీల్ చంద్ర స్థానంలో రాజీవ్ కుమార్ నియమితులు అయ్యారు.