Monday, December 23, 2024

ఉపాధి హామీకి ‘ఆధార్’ శిలువ!

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి వ్యూహంలో, వికసిత్ భారత్‌లో మూడొంతుల దేశ జనాభాకు చోటు లేదని అదే పనిగా రుజువవుతూ వుంది. అయినా జనం తమ వెంటే నడుస్తున్నారనే ధీమాతో ఆయన ప్రభుత్వం వారిని మోసం చేస్తూనే వుంది. పల్లెల్లోని నిరుపేదలకు ఉపాధి కల్పించి వారి కనీస జీవన వ్యయానికి కొరత లేకుండా చేయడానికి పూర్వపు యుపిఎ ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) పథకాన్ని నీరుగార్పించడానికి బిజెపి పాలకులు చేయని యత్నం లేదు. నిధులు కోసివేసి, చెల్లింపుల జాప్యానికి తెగించి అటకెక్కించడానికి ఎంతగా గోతులు తవ్వినా ప్రజల్లో గల ఆదరణ రీత్యా నామ మాత్రంగా నైనా దానిని కొనసాగించక తప్పడం లేదు. అప్పటికీ ఊరుకోబుద్ధి కాక ఇప్పుడు ఆధార్‌తో అనుసంధానమనే కొత్త మారణాస్త్రాన్ని ఈ మానవీయ పథకంపై ప్రయోగించారు. దీని ప్రకారం ఇక నుంచి ఈ పథకం చెల్లింపులు ఆధార్ కార్డు ప్రాతిపదికగా జరుగుతాయి.

ఈ పథకం కింద క్రియాశీల కార్మికులుగా గుర్తించిన వారు చేసిన సూచన మేరకు ఆధార్ చెల్లింపులకు గడువును ఇక ఎంతమాత్రం పొడిగించరాదని నిర్ణయించినట్టు ప్రభుత్వం చెబుతున్నది. గత మూడు ఆర్ధిక సంవత్సరాలలో ఈ పథకం కింద కనీసం ఒక రోజు పని చేసిన వారిని క్రియాశీల కార్మికులుగా గుర్తించి వారు చెప్పారని ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేశారంటే పాలకులది ఎంత వక్ర బుద్ధో తెలుస్తున్నది. మొత్తం 25.25 కోట్ల మంది నమోదైన ఉపాధి హమీ కార్మికుల్లో వీరు 14.35 కోట్ల మంది ఉంటారట. మిగతావారు జాబ్ కార్డులు గలవారు, అసలు కార్మికులయిన జాబ్ కార్డులు గల వారిని వదిలివేసి యాక్టివ్ కార్మికుల సూచనను పాటించడంలోని ఔచిత్యం ఏమిటి? ఆధార్ ఉన్న వారికే ఈ పథకం ద్వారా ఉపాధి పనులు ఇవ్వాలని 2022 ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అదే పనిగా పోరుతున్నది. పర్యవసానంగా ఆధార్ లేని 7.6 కోట్ల మంది కార్మికులను ఈ పథకం వర్తించే వారి జాబితా నుంచి రాష్ట్రాలు తొలగించినట్టు సమాచారం. ఇప్పుడిక ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేశారు.

కాబట్టి ఆ కార్డులు లేనివారందరికీ తలుపులు మూతబడ్డాయని భావించాలి. నిరక్షరాస్యత, నిరుపేదరికం గుట్టలుగుట్టలుగా వున్న దేశం మనది. గ్రామీణ వ్యవసాయ కూలీల్లో ఇవి అపరిమితంగా మేట వేసుకొని వున్నాయి. కేంద్రం ఆధునిక సాంకేతికతలను ప్రయోగించడం ద్వారా వీరిని ప్రభుత్వ పథకాలకు అనర్హులను చేస్తున్నది. 2023 ఈ పథకం క్షీణస్థితికి అతి పెద్ద ఉదాహరణ. మూడేళ్ళ కాలంలో ఎప్పుడూ లేనంత అల్ప స్థాయిలో గత ఏడాది ఈ పథకం అమలైంది. అంతేకాదు 2023 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి అతి తక్కువగా రూ. 60 వేలు కోట్లే కేటాయించారు. ఇది 2022 బడ్జెట్ కేటాయింపుల కంటే 18% తక్కువ. దీనిని బట్టి బిజెపి ప్రభుత్వానికి గ్రామీణ నిరుపేదలంటే ఎంతటి తిరస్కారభావమున్నదో అర్థమవుతుంది. వ్యవసాయ ఆధార భారతంలో ఆ రంగంలోని కూలీల అవసరం గురించి వివరించి చెప్పనక్కర లేదు. కరువు, కాటకాల్లో, అతివృష్టి, అనావృష్టిల్లో పనులు దొరక్క పొట్ట చేతపట్టుకొని కుటుంబాలకు కుటుంబాలుగా వ్యవసాయ కార్మికులు సుదూర ప్రాంతాలకు, పనులు దొరికే చోట్లకు వలసలు పోతుంటారు. అటువంటి వారికి ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం అది లేదని చెప్పి ఉపాధి హామీ పనులను నిరాకరించడం చెప్పనలవికాని అపరాధం.

ఆధార్ నిర్బంధాన్ని 2023 జనవరి నుంచి అయిదు సార్లు వాయిదా వేసి మొన్న సోమవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఉపాధి హామీ కార్మికులు బ్యాంకు ఖాతాను కలిగి వుండాలి, అది ఆధార్‌తోనూ, జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌తోనూ అనుసంధానించి వుండాలి. నిరక్షర కుక్షులైన సాధారణ పల్లీయుల మీద ఇంత భారం మోపడంలోని నిర్దయ అంతా ఇంతా కాదు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదైన కార్మిక కుటుంబాలకు ఏడాదికి 100 రోజులకు తక్కువ కాకుండా ప్రభుత్వం పని చూపించాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ పని దినాలను 150 కి పెంచిందంటే దీనికి పేదల్లో ఎంత గిరాకీ ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొవిడ్ కాలంలో పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయిన అసంఖ్యాక అసంఘటిత రంగ కార్మికులు గ్రామాల్లోని స్వస్థలాలకు పోయి ఈ పథకాన్ని ఆశ్రయించి పొట్ట పోషించుకొన్నారు. ఈ పథకం కారణంగా తమ వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడిందని, అందువల్ల తాము సాగు సెలవు తీసుకోదలిచామని, ప్రైవేటు పొలం పనులను కూడా ఈ పథకం కింద చేర్చి తమకు ఉపశమనం కలిగించాలని పెద్ద రైతులు అభ్యంతరం తెలపడం, డిమాండ్ చేయడం తెలిసిందే.

అంటే గ్రామాల్లో భూమి గలవారు ఇచ్చే పనుల మీదనే ఆధారపడి బతికే స్థితిలో చిరకాలంగా అణగారి వున్న భూమిలేని దళిత, బిసి తదితర వర్గాల కార్మిక కుటుంబాలకు ఈ పథకం వెన్నెముకలా పని చేస్తున్నది. ఆధార్ అనుసంధాన విధానం ద్వారా బిజెపి పాలకులు ఈ వెన్నెముకను విరిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News