Monday, December 23, 2024

ఉపాధి హామీకి ఆధార్ గండం

- Advertisement -
- Advertisement -

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఇప్పటికే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు తగ్గించి, పనులు లేకుండా చేస్తున్న బిజెపి సర్కారు ఏదో ఒక కొర్రీ పెడుతూ కూలీల ఉపాధిని దెబ్బ తీస్తున్నది. ఆధార్ అనుసంధానం జరగనిదే ఇకపై పేదలకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు పుట్టవు, వేతనాలు అందవు. లోపభూయిష్టమైన ఈ ప్రక్రియతో పేదల జీవితాలకు ఒక దెబ్బ తగిలింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆధార్‌తో అనుసంధానించి వేతనాలు చెల్లించే విధానం జనవరి 01, సోమవారం నుండే ప్రారంభమైంది. ఈ విధానంపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం వాటిని బేఖాతరు చేసింది. జాబ్ కార్డులతో ఆధార్ అనుసంధానం కాని కార్మికులకు ఇకపై వేతనాలు లభించే అవకాశం లేకుండా పోయింది. ఎంతో కాలంగా అసలు గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద ఆది నుండే గుర్రుగా వున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు పేదల మీద సాంకేతికతను ఆయుధంగా వాడుతూ కోట్లాది మందిని దూరం చేయడానికి సిద్ధపడింది.

ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు కలిగిన వారిలో గత నెల 27వ తేదీ నాటికి 34.8% మందికి ఆధార్ నెంబరుతో అనుసంధానం జరగలేదు. ఈ పద్ధతి కింద కార్మికుడి బ్యాంక్ ఖాతా, జాబ్ కార్డు ఈ రెండూ ఆధార్‌తో అనుసంధానం కావాల్సి వుంటుంది.ఈ ఖాతా భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ మ్యాపర్‌తో కూడా అనుసంధానం కావాలి. ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటి నుండీ కార్మికుల జాబ్ కార్డుల తొలగింపు గణనీయంగా పెరిగింది. విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలతో కూడిన ‘లిబ్‌టెక్ ఇండియా’ కన్సార్టియం తెలిపిన వివరాల ప్రకారం గత 21 నెలలలో 7.6 కోట్ల మంది కార్మికులను ఈ వ్యవస్థ నుండి తొలగించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అందించిన సమాచారం ప్రకారమే డిసెంబర్ 27వ తేదీ నాటికి జాబ్ కార్డు హోల్డర్లలో 34.8% మంది తాజా చెల్లింపుల పద్ధతిని అనర్హులు అయ్యారు. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో కనీసం ఒక్క రోజైనా పని చేసిన కార్మికులలో 12.7% మంది ఇప్పటికీ చెల్లింపుల విధానంతో అనుసంధానం కాలేదు. గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది.

ఈ పథకానికి మంచి ఆదరణ వున్నప్పటికీ ప్రభుత్వం దానిపై తగిన శ్రద్ధ చూపడం లేదు. 2023 బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో 89,400 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం 2023- 24లో దానిని 60,000 కోట్ల రూపాయలకు కుదించింది. కోట్లాది మంది పేద ప్రజల్ని కనీస ఆదాయం కూడా సంపాదించకుండా చేయడానికి సాంకేతికతను మోడీ ప్రభుత్వం ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుంది. ఉపాధి హామీ చెల్లింపుల్లో ఎబిపిఎస్‌ను తప్పనిసరి చేయడమనేది కొత్త సంవత్సరంలో దేశంలోని కార్మికులకు మోడీ ప్రభుత్వ ఇచ్చిన క్రూరమైన కానుక అయింది. గత రెండేండ్లలో 7.6 కోట్ల మంది రిజిష్టర్డ్ కార్మికులు జాబ్ కార్డ్ కోల్పోయారు. దీంతో వీరంతా పని హక్కును కోల్పోయారు. ఎబిపియస్‌ను తప్పనిసరి చేయటం ద్వారా 2022 -23లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాబ్‌కార్డుల తొలగింపునకు తెరలేపింది. దీంతో మొత్తం కార్మికుల్లో 87.52 శాతం యాక్టివ్ వర్కర్స్ మాత్రమే ఎబిపియస్‌కు అర్హులవుతుంటే గడిచిన 11 నెలల్లో 12.5 శాతం మంది అనర్హులయ్యారు.

ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన, వేతనాల చెల్లింపులకు జాబ్ కార్డు, బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసిన ఈ విధానం కూలీలకు శరాఘాతం. సాంకేతిక సమస్యలకు తోడు చాలా కారణాలతో ఇది ఎంత లోపభూయిష్టంగా అమలు జరుగుతున్నదో ఇప్పటికే కేంద్రానికి ఈ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు పలుమార్లు తెలియచేశాయి. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచీ ఈ విషయంలో పట్టుదలగా ఉంటూ, మొదట్లో ఆగస్టు నెలాఖరు, ఆ తరువాత డిసెంబరు 31 గడువులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం తొలి రోజునుంచి దీనిని అమల్లోకి తేవడంతో అనుసంధానం జరగని కూలీలు ఇప్పుడు నిరాశగా వెనుదిరుగుతున్నారు. జాబ్‌కార్డు ఆధారంగా కూలీ పని చేసుకొని, బ్యాంకు ఖాతాలో కూలీపడితే మురిసిపోయే స్థితిపోయి, మధ్యలో ఆధార్‌తో లంకె ఏర్పడింది. ఈ మూడింటిలోని వివరాలు ఏకరీతిలో వుండాల్సిరావడం వారి పాలిట శాపమైంది. ఉపాధి హామీ లబ్ధిదారు పేరు, వారి బ్యాంక్ వివరాల జోడీతో ఖాతా ఆధారంగా నగదు బదిలీ జరిగిపోయే సులువైన పద్ధతి పోయి, ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ (ఎబిపియస్)ను తీసుకొచ్చారు.

దీని ద్వారా పథకంలో అక్రమాలను నిరోధించవచ్చని, వేతనాలు కూడా సత్వరమే అందించవచ్చని, పని కల్పన నుంచి వేతనం అందే వరకూ కూలీలకు అన్యాయం జరగకుండా చూడవచ్చనేది ప్రభుత్వ పెద్దల వాదన. అసలు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించడం నుంచి, సామాజిక భద్రతకు ఉద్దేశించిన పథకాలన్నింటినీ ఈ ఎబిపియస్ విధానంలోకి తేవడం మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ మంత్రిత్వశాఖ ఆదిలో దీని అమలుకు నిర్ణయించినప్పుడు మొత్తం ఉపాధి హామీ కార్మికుల్లో 40% మాత్రమే అర్హులు.లబ్ధిదారు ఆధార్ సంఖ్య వారి జాబ్‌కార్డుతో, బ్యాంకు ఖాతాతో సంధానం కావడంతో పాటు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా బేస్‌తో మ్యాప్ కావాలి. అలాగే సదరు బ్యాంకు గుర్తింపు సంఖ్య కూడా మ్యాప్ కావాలి. హక్కుదారుడికి ఎక్కువ ఖాతాలుంటే అది మరో చిక్కు. ఇక ఆధార్, జాబ్ కార్డ్, బ్యాంకు ఖాతాల్లో లబ్ధిదారు పేరు, ఇంటి పేరు, వివరాల్లో ఏ మాత్రం తేడాలున్నా, స్పెల్లింగ్ పొరపాట్లున్నా వాటిని సరిచేయించుకోవడం కార్మికులకు బ్రహ్మప్రళయం అవుతున్నది. దీనితో స్థానిక అధికారులు కార్మికుల పేర్లు తొలగించడం మొదలుపెట్టారు.

దేశ వ్యాప్తంగా ఏడాదిన్నర కాలంలో ఆరు కోట్లమంది ఉపాధికి దూరమయ్యారనే అంచనాలున్నాయి. ఆగస్టు నెల చివరికి గడువు పెంచినప్పటికి కూడా 40 శాతం మంది ఎబిపియస్‌కు అనర్హులుగా ఉండిపోయారు. గ్రామీణ మంత్రిత్వశాఖ అధికారికంగా చెప్పిన ప్రకారమే మొన్న డిసెంబరు 27 నాటికి జాబ్‌కార్డులు వున్న వారిలో 34.8 శాతం ఈ పేమెంట్ విధానానికి దూరంగా మిగిలిపోయారు. అసలు ఎబిపియస్‌లో నగదు బదిలీకి తక్కువ సమయం పడుతుందన్న ప్రభుత్వం వాదనే సరైనది కాదు. ఎందుకంటే ఎకౌంట్ పేమెంట్ కంటే ఆధార్ ఆధారిత వ్యవస్థలో ఎక్కువ జాప్యం జరుగుతూ, తిరస్కరణలు సైతం అధికంగా వుంటున్నాయి. దీని వల్ల ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు అందుబాటులో లేకపోవడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న పంచాయితీలకు మాత్రం ఈ విధానం నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం ఇప్పుడు దిగివచ్చింది. కానీ, ఆధార్ సీడింగ్, బ్యాంక్ మ్యాపింగ్ ప్రక్రియలను పూర్తిగా ప్రక్షాళించకుండా ఎబిపియస్‌ను అమలులోకి తేవడమే పెద్ద పొరపాటు.

కాబట్టి సోషల్ ఆడిటింగ్ ద్వారా, సంబంధిత రంగాల్లో పని చేస్తున్న సంస్థల సహకారంతో లబ్ధిదారుకు న్యాయం చేకూర్చే వరకూ దీని అమలును నిలిపివేయాలి. గ్రామీణ స్థాయిలో వలసలను నిరోధించేందుకు, అభివృద్ధి జరిగేందుకు, ఉపాధి కల్పించేందుకు దేశంలోని వామపక్షాల ప్రత్యేక చొరవతో గత పదిహేడు సంవత్సరాలు క్రితం ప్రారంభమయిన ఈ ప్రజా పథకం అస్తవ్యస్తమైన ఓ సాంకేతిక వ్యవస్థకు బలికాకూడదు. పేదలు, అణగారిన వర్గాలు, శ్రామికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్దయగా వ్యవహరిస్తున్న తీరు మారాలి. సాంకేతికత, సంక్షేమం కలపాలన్న అత్యుత్సాహంతో పాటించలేని బాధ్యతను పేద కార్మికులపై మోపాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News