Thursday, January 23, 2025

ఇక ముస్లిం వివాహాలకు ఆధార్ తప్పనిసరి!

- Advertisement -
- Advertisement -
వధువు, వరుడు వయోజనులా, కాదా అని గుర్తించమని ఖాజీలకు ఆదేశం

హైదరాబాద్: తక్కువ వయస్సు ఉన్న బాలికలకు వివాహం జరిపించే ఖాజీలపై తెలంగాణ ప్రభుత్వం ఇకపై కొరడా ఝళిపించనున్నది. ముస్లిం వివాహాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వక్ఫ్ బోర్డుకు ఆదేశాలిచ్చారు. తక్కువ వయస్సున్న వారిని అరబ్ జాతీయులకిచ్చి వివాహం చేస్తున్నారని ఫిర్యాదులు అందుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు ఈ చర్య చేపట్టింది. ఇందుకు వధువు, వరుడి ఆధార్ కార్డు నమోదును తప్పనిసరి చేసింది. వేరే ఇతర ఆధారాలతో వివాహాలు చేసేట్టయితే ఆంక్షలు విధించింది.

వివాహం చేసుకోబోయే వధు,వరులు వయోజనులా, కాదా అన్నది గుర్తించాలని ఖాజీలకు ఆదేశించారు. అందుకు ఆధార్ కార్డును ప్రమాణంగా తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. వివాహానికి సంబంధించిన వివరాలను వెంటనే వక్ఫ్ బోర్డుకు సమర్పించాలని కూడా షరతు విధించింది. ఒకవేళ ఇలా చేయడాన్ని విస్మరిస్తే చట్టబద్ధ చర్యలు తీసుకుంటారు.
ఇదివరలో ఖాజీలను మైనారిటీ సంక్షేమ శాఖ నియమించేది. కానీ ఇప్పుడు అందులో మార్పు చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరు దరఖాస్తును సమీక్షించి, సంబంధిత శాఖకు సిఫారసు చేస్తారు. ఇంతేకాకుండా ఇకపై ముస్లింల వివాహ సర్టిఫికేట్లు కూడా ఆన్‌లైన్‌లో పెడతారు. ఇప్పటి వరకు అదంతా రాతల్లో ఉంటుండేది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వివాహం జరిగినప్పటికీ హైదరాబాద్‌లోని హజ్ హౌస్‌కు వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు.

దేశంలో ముస్లిం వివాహాలను ఆన్‌లైన్‌లో నమోదుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని వక్ఫ్‌బోర్డు చైర్మన్ ముహమ్మద్ మసిహుల్లా ఖాన్ తెలిపారు. గత వివాహాలను వదిలేసి ఇకపై జరిగే అన్ని ప్రస్తుత వివాహాలను వక్ఫ్‌బోర్డు రిజిష్టర్ చేస్తుంది. దీని ద్వారా అనేక అవకతవకలను, దురాచారాలను నివారించే వీలు కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News