దిశా శాలియన్ మృతి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి శివసేన (యూబీటీ) నేత ఆదిత్యథాక్రే పై మంగళవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయనతోపాటు నటులు సూరజ్ పంచోలి, డినోమోరియా, నటి రియాచక్రవర్తి, పోలీస్‌శాఖ మాజీ ఉన్నతాధికారి పరంభీర్ సింగ్, విధుల నుంచి తొలగింపునకు గురైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజె పేర్లు అందులో ఉన్నాయి. ఈ విషయాన్ని శాలియన్ తరఫు న్యాయవాది నీలేశ్ ఓఝూ మీడియాకు వెల్లడించారు. దిశ మృతి కేసులో పరంబీర్ సింగ్ ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. “ ఆదిత్యథాక్రేను రక్షించేందుకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి అబద్ధాలు అల్లారు. డ్రగ్స్ వ్యాపారాల్లో థాక్రే ప్రమేయం ఉందని, ఎన్‌సీబీ ( నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ) దర్యాప్తు పేపర్లను బట్టి వెల్లడవుతోంది. ” అని తెలిపారు. ఫిర్యాదులో అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయని వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ తండ్రి సతీశ్ శాలియన్ ఇటీవల ముంబై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదిత్య థాక్రేపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడి మరణానికి వారం రోజుల ముందు అతడి మాజీ మేనేజర్ దిశా శాలియన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. 2020 జూన్ 8న ముంబై లోని ఓ భవనంపై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. దిశా చనిపోయిన రోజుల వ్యవధి లోనే నటుడు సుశాంత్ తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఈ కేసును కప్పిపుచ్చుకునేందుకు యత్నించిందనే ఆరోపణలు వచ్చాయి.
హత్య అత్యాచారంతో పాటు సుశాంత్ మృతి తోనూ ముడిపెడుతూ ప్రచారం సాగింది.నాడు తన కుమార్తె మృతికి సంబంధించి సతీశ్ శాలియన్ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ 2020 జూన్ 8న తన కుమార్తె ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసిందని, దానికి ఆదిత్య థాక్రేతోపాటు అతని బాడీ గార్డులు , నటులు సూరజ్ పంచోలి, డినోమోరియా , మరికొందరు హాజరయ్యారని ఇటీవల కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తమ వద్ద సాక్షాధారాలున్నాయని ఆ సమయంలో నే లాయర్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.