న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో మరొక సంచలన విషయం వెలుగు లోకి వచ్చింది. శ్రద్ధా వాకర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా హత్య చేసిన తరువాత ఆమె శరీరాన్ని రంపంతో ముక్కలు ముక్కలుగా కోసినట్టు పోస్ట్‌మార్టమ్ విశ్లేషణలో బయటపడింది. శ్రద్ధా వాకర్‌కు చెందిన 23 ఎముకలకు జరిపిన పరీక్షల ద్వారా ఈ విషయం వెల్లడైనట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసుపై జనవరి చివరి వారంలో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.
కాగా, గత నెలలో మెహ్రౌలీ అడవుల్లో శ్రద్ధావాకర్ ఎముకలను పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో డీఎన్‌ఎ పరీక్షలు చేసి అవి శ్రద్ధావేనని తేల్చారు. ఈ హత్య కేసులో 28 ఏళ్ల పూనావాలాను నవంబర్ 12న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి అడవుల్లో విసిరేసినట్టు పూనావాలా ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు