న్యూఢిల్లీ: సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టులో కెప్టెన్ అజింక్య రహానెపై ఒత్తిడి ఉండడం ఖాయమని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. కొంతకాలంగా రహానె ఫామ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌లో అతను అంతంత మాత్రంగానే రాణించాడు. అంతేగాక, ఐపిఎల్‌లోనూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఇలాంటి స్థితిలో తొలి టెస్టులో టీమిండియాను ముందుండి నడిపించడం అతనికి అనుకున్నంత తేలికకాదని పేర్కొన్నాడు. మెరుగైన బ్యాటింగ్ చేయాల్సిన ఒత్తిడి రహానెపై నెలకొందన్నాడు. అంతేగాక విరాట్ కోహ్లి లేక పోవడంతో రహానె కెప్టెన్సీ బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుందన్నాడు. ఇది రహానెను కాస్త ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉందన్నాడు.
అయితే కిందటి ఆస్ట్రేలియా పర్యటనలో రహానె అసాధారణ కెప్టెన్సీతో టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించిన విషయాన్ని మరువ కూడదని చోప్రా పేర్కొన్నాడు. కీలక ఆటగాళ్లు లేకున్నా రహానె అప్పుడూ జట్టును ముందుండి నడిపించాడన్నాడు. కానీ ఈసారి అలాంటి అవకాశం అతనికి ఉండక పోవచ్చన్నాడు. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం ఒక్కటే రహానె అతి పెద్ద ఊరటగా చోప్రా అభివర్ణించాడు.
Aakash Chopra about Rahane Test Captaincy