మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌కు చెందిన నీలోఖేరీ(రిజర్వ్) నియోజకవర్గం అభ్యర్థి అమర్ సింగ్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా అమర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ రైతులు, మహిళలు, దళితులు, మైనారిటీలకు తీరని అన్యాయం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోగల సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన ప్రతాప్ సింగ్ బజ్వా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన
అమర్ సింగ్ తాను బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరానని, నీలోఖేరి(రిజర్వ్) స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధరంపాల్ గోండర్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. నీలోఖేరీలోని సిక్కు ప్రజలలో ధరంపాల్‌కు మంచి పలుకుబడి ఉందని ఆయన తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్, బిజెపి మధ్య ముఖాముఖీ పోరు నడుస్తోందని, నీలోఖేరీలో కూడా అదే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. కాగా..ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన ఆప్ హర్యానాలో సొంతంగా పోటీ చేస్తోంది. గత నెల ఎన్నికల పొత్తు కోసం కాంగ్రెస్, ఆప్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.