రాయిపూర్ : కాంగ్రెస్ పాలిత చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రానికి శనివారం పది హామీలు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఉచిత విద్యుత్, మహిళలకు ‘సమ్మాన్ రాశి’,నిరుద్యోగులకు నెలవారీ రూ. 3000 అలవెన్స్ ప్రధానమైనవి. పంజాబ్ మాదిరిగా ఈ రాష్ట్రంలో కూడా పాగా వేయాలన్న కాంక్షతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఓటర్లను ఆకర్షించడానికి ఉచిత హామీలు ప్రకటించడం విశేషం. ఆప్ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశిస్తూ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాయని చెప్పారు.
తాను మరణించినా సరే ఇచ్చిన ఈ వాగ్దానాలు తప్పక నెరవేరుతాయని స్పష్టం చేశారు. ఈ హామీల్లో ఇంకా 24 గంటలు నిరంతర విద్యుత్, 300 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ సరఫరా, 2023 నవంబర్ వరకు పెండింగ్ విద్యుత్ బిల్లుల రద్దు, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ. 1000 గౌరవ భృతి, స్కూలు పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్య తదితర హామీలను వెల్లడించారు. ప్రతిపౌరునికి ఢిల్లీ మాదిరిగా ఉచిత, నాణ్యమైన వైద్య చికిత్స అందిస్తామన్నారు. ప్రతిగ్రామం లోను, నగరాల్లో ప్రతివార్డు లోను మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.