న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలే లక్షంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి మరో షాక్ తగిలింది. పంజాబ్ లోని మొత్తం 13 లోకసభ స్థానాలకు, ఛండీగఢ్ లోని ఒక స్థానానికి తమ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ శనివారం తెలిపారు. ఈ షాక్‌తో ఇండియా కూటమి మరింత బలహీనం అవుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇటు ఉత్తరప్రదేశ్ లో కూడా పరిస్థితి ఏంటనేది స్పష్టంగా తెలియడం లేదు. ఈ రాష్ట్రంలో ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం అయితే కుదిరింది.
కానీ, ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయిన జయంత చౌదరి నేతృత్వం లోని రాష్ట్రీయ లోక్‌దళ్ , ఎన్డీఏతో చేతులు కలపనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించిన దగ్గర నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది.
అదే జరిగితే ఆ రాష్ట్రంలో ఇండియా కూటమికి పెద్ద దెబ్బ తగిలినట్టే. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇండియా కూటమికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తొలుత ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన బీహార్ సిఎం నితీశ్ కుమార్ కూటమి నుంచి వైదొలిగారు. అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయడానికి నిర్ణయించారు.