Tuesday, December 24, 2024

ఇదే నేను నేర్చుకున్న అతి పెద్ద గుణపాఠం

- Advertisement -
- Advertisement -

హర్యానా ఫలితాలపై కేజ్రీవాల్ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఎన్నికలలో అతి విశ్వాసం ఎవరికీ పనికిరాదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. హర్యానా ఎన్నికల ఫలితాల ద్వారా తాను నేర్చుకున్న అతి పెద్ద గుణపాఠం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. 90 స్థానాలతో కూడిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి మెజారిటీ స్థనాలు కైవసం చేసుకుని మూడవసారి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతుందగా మొదటిసారి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన ఆప్ బోణీ కొట్టలేకపోయింది. మంగళవారం హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆప్ మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమైన కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎన్నికలలో అతి విశ్వాసంతో ఉండకూడదన్నదే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తాను నేర్చుకున్న అతి పెద్ద గుణపాఠమని చెప్పారు.

ఏ ఎన్నికను తేలికగా తీసుకోకూడదు. ప్రతి ఎన్నిక, ప్రతి సీటు చాలా క్లిష్టమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. పోటీ చేసే సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరని కారణంగా హర్యానాలో ఆప్, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు సాధ్యపడలేదు. కనీసం తమకు 9 సీట్లు కేటాయించాలని కోరినప్పటికీ కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో ఆప్ ఒంటరిగా 89 స్థానాలలో తన అభ్యర్థులను రంగంలోకి దింపింది. పోటీ చేసిన అన్ని స్థానాలలో ఆప్ అభ్యర్థులు బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులకు వెనుకబడిపోయారు. కాగా..ఇదివరకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగిస్తూ ఆప్ మద్దతు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని ప్రకటించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News