ఢిల్లీ: రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆప్, బిజెపి మధ్య రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజి నుంచి ఢిల్లీ వైపు అధికంగా నీటిని విడుదల చేయడం ద్వారా నగరాన్ని మునిగేలా చేయడానికి కుట్ర జరిగిందని ఆప్ నాయకుడు, ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ మంత్రి సౌరబ్ భరద్వాజ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ‘వరద వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్,ఢిల్లీ, హర్యానా వైపు సమానస్థాయిలో నీటిని విడుదలచేయాలి. కానీ ఈ నెల 9వ తేదీనుంచి 13 వరకు ఢిల్లీ వైపు మాత్రమే నీటిని విడుదల చేశారు. సమానస్థాయిలో నీటిని విడుదల చేసి ఉంటే యమున సమీప ప్రాంతాలు సురక్షితంగా ఉండేవి. ఐదు రాష్ట్రాలు ఈ వర్షాకాలంలో ప్రభావితమయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్,హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఆ జాబితాలో ఉన్నాయి.
కానీ ఢిల్లీలో వర్షాలు లేవు. అయినా సరే ందుకు యమునలో నీటిమట్టం ప్రమాదస్థాయిలో పెరిగి ఢిల్లీని ముంచెత్తింది? ఇదంతా ఉద్దేశపూరకంగా జరుగుతోంది’ అని భరద్వాజ్ ఆరోపించారు. రాష్ట్ర పిడబ్లుడి శాఖ మంత్రి ఆతిషి , ఆప్ నేత సోమనాథ్ భారతి సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఇదంతా బిజెపి చేసిన కుట్ర అని వారు మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను బిజెపి తిప్పి కొట్టింది. ఆప్ ప్రభుత్వం బాధ్యతలనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని, నగరంలో వరదలకు ఇతర రాష్ట్రాలను నిందిస్తోందని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ విమర్శించారు. కోవిడ్19 సమయంలో కూడా రాష్ట్రప్రభుత్వం ఇదే పని చేసిందని ఆయన అన్నారు. మరో వైపు హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జైప్రకాశ్ దలాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హత్నీకుండ్ బ్యారేజ్‌నుంచి నీటిని విడుదల చేసినప్పుడు ఆ నీరు మొదట ఢిల్లీ , ఆగ్రా, అలహాబాద్ మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుందన్నారు. నదిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అక్రమ నివాసాలు, నిర్మాణాలే ఢిల్లీలో అనేక ప్రాంతాలు నీటిలో మునగడానికి మూలకారణమని ఆయన అన్నారు.