Monday, December 23, 2024

విజేత ఆప్

- Advertisement -
- Advertisement -

దేశంలో ప్రజాస్వామిక విధి విధానాలు నియమబద్ధంగా సాగిపోతే సుప్రీంకోర్టు పదే పదే జోక్యం చేసుకోవలసిన అవసరం తలెత్తదు. గత కాంగ్రెస్ పాలకులకు మించిపోయి కేంద్రంలోని బిజెపి సారథులు రాజకీయ పాచికలాట ఆడుతున్నారు. మితిమించిన స్వప్రయోజన కాండకు తెగబడుతున్నారు. ఆ క్రమంలో రాజ్యాంగ వ్యవస్థలను హద్దులు మీరి దుర్వినియోగం చేస్తున్నారు. అందువల్ల ప్రజాస్వామ్య సరళిలో అడుగడుగునా న్యాయ స్థానాల జోక్యం అవసరమవుతున్నది. మామూలుగా పద్ధతి ప్రకారం జరిగిపోయి వుండవలసిన ఘట్టాలను జరిపించుకోడానికి కూడా బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పడం లేదు. ఎన్నికల్లో ప్రజలిస్తున్న తీర్పులను కూడా బిజెపి గౌరవించకపోడం వల్లనే ఇలా జరుగుతున్నది. గత డిసెంబర్ 4న జరిగిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 250 స్థానాల్లో 134 గెలుచుకొని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) తిరుగులేని విజేతగా అవతరించినా దానికి మేయర్ పదవి దక్కడానికి రెండున్నర మాసాలు పట్టింది.

అది కూడా సుప్రీంకోర్టు కలుగజేసుకొని 24 గం.ల్లో మేయర్ ఎన్నిక తేదీ ప్రకటించాలని తిరుగులేని ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే జరిగింది. ఆలోగా కేంద్ర పాలకులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆడిన నాటకానికి మేయర్ ఎన్నిక ఘట్టం 3 సార్లు వాయిదా పడింది. ఎన్నికల్లో ఆప్ తర్వాత స్థానాన్ని సాధించుకొన్న బిజెపి 116 స్థానాలను గెలుచుకొన్నది. కాంగ్రెస్‌కు కేవలం 9 సీట్లే వచ్చాయి. బలాబలాల్లో స్పష్టంగా ఇంత తేడా కనిపిస్తున్నప్పుడు మేయర్ పదవి కోసం బిజెపి ఆరాటపడడం బొత్తిగా అర్థం లేని పని. అడ్డ దారులు తొక్కి దొడ్డి దారిలో అధికారం పొందాలనే కుటిల యత్నమే తప్ప అది మరొకటి కాబోదు. గోవా తదితర అనేక చోట్ల ఇవిఎంలలో ఓటు మీట శబ్దం సద్దుమణగక ముందే బలాబలాలను తారుమారు చేయించి విజేతల చేతికి అధికారం దక్కకుండా చేసిన ఘనత బిజెపిది. అదే విద్యను ఢిల్లీ మేయర్ పదవి విషయంలోనూ ప్రయోగించబోయి అది చతికిలబడింది. తీరా సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత మేయర్ ఎన్నికలో జరిగిన అసాధారణ ఆలస్యానికి ఆప్ ఎత్తుగడలే కారణమని ఎదురు దాడికి దిగింది.

మేయర్ పదవికి తక్షణమే ఎన్నిక జరిపించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు ఓటు చేయడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలే ఎన్నికల్లో తేలిన బలాబలాల మేరకు బుధవారం నాడు ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ మేయర్‌గా ఎన్నిక కావడానికి తోడ్పడ్డాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యుల చేత ఓటు వేయించడం ద్వారా ప్రజల తీర్పును తారుమారు చేయడానికి బిజెపి కుట్ర పన్నినందునే మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు జరిగిన ఈ ఎన్నికతో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌పై 15 ఏళ్ళుగా తాను అనుభవిస్తూ వచ్చిన ఆధిపత్యాన్ని బిజెపి కోల్పోక తప్పలేదు. ఢిల్లీ రాష్ట్ర అధికారంతో పాటు కార్పొరేషన్ అధికారాన్ని కూడా అది వదులుకోవలసి వచ్చింది. ఇందుకు కారణం ఆప్ పాలనలోని మంచి కొంత అయితే ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా వెనుకాడకుండా బిజెపి కొనసాగిస్తున్న ప్రజాస్వామ్య విద్రోహ పోకడలు మరి కొంత కారణమని అంగీకరించక తప్పదు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి తన అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు వంటి ‘మోడీ డబులింజిన్ పాలన’ నినాదాన్ని వినిపించింది.

ఆప్ ‘కేజ్రీవాల్ ప్రభుత్వం, కేజ్రీవాల్ కార్పొరేటర్’ అనే నినాదాన్ని ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ విజయవంతంగా అమలు పరుస్తున్న ఢిల్లీ మోడల్ పాలన ఈ ఎన్నికల్లో ఆప్‌కి ప్రజల మద్దతును విశేషంగా సమీకరించింది. మొహల్లా స్థాయిలో చెత్త తొలగింపును పకడ్బందీగా జరిపిస్తామని చేసిన వాగ్దానం బాగా పని చేసింది. ఢిల్లీ రాష్ట్ర పాలనలో భాగంగా మొహల్లా స్థాయి దవాఖానాల నిర్వహణ ఆప్‌కి ఇంతకు ముందే మంచి పేరు తెచ్చింది. అలాగే కోటి 10 లక్షల మంది జనాభా వున్న ఢిల్లీ మహా నగరంలో ప్రాథమిక పాఠశాలలను ఆప్ తీర్చి దిద్దిన తీరు దానికి ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మునిసిపల్ ఎన్నికల్లో ఆప్ విజేతగా అవతరించిన వెంటనే కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎప్పటి మాదిరిగానే ప్రధాని మోడీ ఆశీస్సులను అర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయన ఇదే పని చేశారు. కాని కేంద్రం నుంచి ఆప్‌కు ఎటువంటి సహకారమూ లభించకపోగా మేయర్ పదవి దక్కకుండా చేయడానికి బిజెపి పన్నిన పన్నాగం గమనించదగినది. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలకు మేలు చేస్తూ వారిని నమ్ముకొన్న వారికి విజయం తప్పదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, మేయర్ పదవి చివరికి ఆప్‌కే దక్కిన తీరు నిరూపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News