ఆప్ అధినేత కేజ్రీవాల్ హెచ్చరిక
చండీగఢ్ : పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యపు ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉంటూ జవాబుదారి పాలన అందిస్తుందని ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటికే తమ మంత్రులకు సిఎం నిర్ణీత లక్షాలు ఖరారు చేశారు. వీటి ప్రాతిపదికగా మంత్రులు పనితీరుతో ముందుకు కదలాల్సి ఉంటుంది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఏ మంత్రి పనిచేసినా వారిని తొలిగించాలని డిమాండ్ చేసే అధికారం ప్రజలకు ఉందని, ఇది ప్రజాస్వామ్యపు హక్కు అని కేజ్రీవాల్ ఆదివారం తేల్చిచెప్పారు. కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే తమ పార్టీ సిఎం పంజాబ్‌లో తగు విధమైన కార్యాచరణకు సముచితమైన వాతావరణాన్ని కల్పించారని పేర్కొన్నారు. పంజాబ్‌లోని పాత మంత్రులకు కొనసాగుతున్న భద్రతను ఇప్పటికే సిఎం తొలిగించారని, ఈ భద్రతను ప్రజలకు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. భారతదేశంలో ఇప్పుడు ప్రజలు పంజాబ్‌లో మాన్ పాలన తీరుపై చర్చించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రులు పనిచేయండి , పదవిలో కొనసాగండి లేకపోతే తెరమరుగు అవుతారని కేజ్రీవాల్ హెచ్చరించారు.