లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) పోటీ చేస్తుందని ఆప్ సీనియర్ నేత ,ఉత్తరప్రదేశ్ ఆప్ ఇన్‌ఛార్జి సంజయ్ సింఘ్ చెప్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ పంచాయత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బలమైన పార్టీగా అవతరించిన ఆప్ పార్టీని మామూలు చిన్న పార్టీగా భావించడం పొరపాటే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ తోనూ పొత్తు పెట్టుకోడానికి చర్చించడం లేదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 40 సీట్లనే దక్కించుకోగా, ఆప్ పార్టీ 83 సీట్లలో విజయం సాధించిందని చెప్పారు. ఆప్ అభ్యర్థులు మొత్తం 1600 మంది పోటీ చేయగా 40 లక్షలకు పైగా ఓట్లను సాధించినట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్షమని, గత ఒకటిన్నర నెలల్లో కోటికి పైగా సభ్యులను సమీకరించామని చెప్పారు. 100 నుంచి 150 స్థానాలకు విధాన సభ ఇన్‌ఛార్జిలను పార్టీ నియమించిందని, ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారిని తమ పార్టీ నేతలు కలుసుకుంటారని చెప్పారు.