Monday, December 23, 2024

గుజరాత్ బరి!

- Advertisement -
- Advertisement -

Equal match fee for men and women cricketers   హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కార్యక్రమ పట్టిక (షెడ్యూల్)ను ప్రకటించిన 19 రోజులకు గుజరాత్ తేదీలు వెల్లడించడంలోని ఔచిత్యం ఏమిటి? ఎన్నికల సంఘం (ఇసి) ఎన్ని రకాల వాదనలతో ఈ ప్రశ్నను నిద్ర పుచ్చాలని ప్రయత్నించినప్పటికీ అది సహేతుకంగా, సజీవంగా వెంటాడుతూనే వుంటుంది. మోడీ పాలనలో ప్రజాస్వామిక సంప్రదాయాలకు, నియమాలకు మనుగడ వుండదనే వాస్తవాన్ని ఇసి మరింత బలపరిచిందనే అభిప్రాయమే గట్టి పడుతున్నది. సమీపంలో ఎన్నికల జరగవలసిన రాష్ట్రాలన్నింటికీ ఒకేసారి షెడ్యూల్ ప్రకటించడం చిరకాలంగా వస్తున్న సంప్రదాయం. ఈసారి హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ షెడ్యూళ్ళు ఒకేసారి విడుదలవుతాయని ఆశించాము.

కాని హిమాచల్‌ప్రదేశ్ తేదీలను గత నెల 14న ప్రకటించి, గుజరాత్ పోలింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 3న విడుదల చేయడం గమనించవలసిన అంశం. ఇంత తేడాతో జరుగుతున్న రెండు రాష్ట్రాల పోలింగ్‌ల ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజున డిసెంబర్ 8న చేపట్టడం ఎంత మాత్రం హేతుబద్ధంగా లేదు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఓటు వేసిన తర్వాత ఫలితాల కోసం ఇంత సుదీర్ఘ కాలం వేచి వుండవలసి రావడం సమర్థించదగినది కాదు. ప్రధాని నరేంద్ర మోడీ వీలైనన్ని ఎక్కువ సార్లు గుజరాత్ ఎన్నికల సభల్లో పాల్గొనడానికి వీలుగా పోలింగ్ షెడ్యూల్‌ను దూరం జరిపారని స్పష్టపడుతున్నది. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ షెడ్యూల్ ప్రకటించిన (అక్టోబర్ 14) వెంటనే జరగవలసిన కోడ్ అమలును ప్రధాని సభ అక్టోబర్ 16 వున్నందున మూడు రోజుల ఆలస్యంగా అక్టోబర్ 17 నుంచి జరిపించారు.

గుజరాత్‌లోని 182 శాసన సభ స్థానాలకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరపనున్నట్టు ఇసి ప్రకటించింది. ఈపాటి స్థానాలకు రెండు విడతల పోలింగ్ అవసరమా, ఈ ఏర్పాటు కూడా ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో తీరికగా ప్రచార సభలు నిర్వహించుకోడం కోసం జరిగినదేనా అనే ప్రశ్న ఉదయిస్తున్నది. గుజరాత్‌ను బిజెపి 27 ఏళ్ళుగా పరిపాలిస్తోంది. 1995 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజేతగా నిలబడింది. జిఎస్‌టి అవకతవక అమలు వంటి ఎన్నో జటిలమైన సమస్యలు ఎదురైనప్పటికీ తన రాష్ట్రంలో తనను ఓడించే శక్తి లేదని ప్రధాని మోడీ నిరూపించుకున్నారు. మోడీ కేంద్రంలో వుండగా గుజరాత్‌లో కమలం ఓడిపోయే ప్రసక్తే లేదని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు భరోసా వ్యక్తం చేస్తున్నారు. అయితే మోడీ మాత్రం ఈసారి ఎన్నికలను సుళువుగా తీసుకోడం లేదు. ఎందుకంటే గుజరాత్‌లో ఓటమి 2024 లోక్‌సభ ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

ఇంత వరకు బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య నేరు పోరుగానే నడిచిన గుజరాత్ ఎన్నికలు మొదటిసారిగా ముక్కోణపు సమరంలోకి అడుగుపెడుతున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి విజయాన్ని సాధించాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నది. ఆప్ ప్రవేశం ఎటువంటి ఫలితాన్నిస్తుంది, పంజాబ్‌ను గెలుచుకున్నట్టు గుజరాత్‌ను కూడా అది సులభంగా తన ఖాతాలో వేసుకోగలుగుతుందా అనే ప్రశ్న తలెత్తుతున్నది. తాను అధికారాన్ని చేపట్టలేకపోతే అది ఎవరి ఓట్లను చీల్చగలుగుతుంది, కాంగ్రెస్ ఓట్లను కాజేయడం ద్వారా బిజెపి పునర్విజయాన్ని, వరుసగా ఏడో సారి కమలనాథులు గుజరాత్ ఏలికలు కావడాన్ని ఖాయం చేస్తుందా? అలా జరిగితే ఆప్ పరోక్షంగా బిజెపికి తోడ్పడినట్టే అవుతుంది. ఢిల్లీలో చేసిన మాదిరిగా పాఠశాలలను అత్యున్నత విద్యా ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, మొహల్లా క్లినిక్‌లను నెలకొల్పి వైద్యాన్ని బాగు చేస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇచ్చి, నిరుద్యోగాన్ని రూపుమాపుతామని ఆప్ వాగ్దానం చేస్తున్నది. అయితే ఢిల్లీ మాదిరిగా గుజరాత్ పట్టణ ఓటర్ల రాష్ట్రం కాదు. గ్రామీణ ప్రాంతాలు ఆప్‌ను ఎంత వరకు ఆహ్వానిస్తాయో చూడాలి. కాంగ్రెస్ ఆర్భాటంగా కనిపించడం లేదు.

ఈసారి అది గుజరాత్‌లో విజయం సాధించలేకపోయినా మూడవ స్థానానికి దిగజారిపోతే అది జాతీయ రాజకీయాల్లోనూ మరింత పతనాన్ని చవిచూస్తుంది. అయితే అది నిశ్శబ్ద ప్రచారాన్ని సాగిస్తున్నదని వార్తలు చెబుతున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లోని 55 పట్టణ నియోజక వర్గాల్లో బిజెపి 44 గెలుచుకోగా, కాంగ్రెస్ 11కే పరిమితమైంది.అదే సందర్భంలో 127 గ్రామీణ నియోజక వర్గాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి 68 స్థానాలు గెలుచుకోగా, బిజెపి 55 మాత్రమే సాధించుకోగలిగింది. ఈసారి కాంగ్రెస్ 125 పైగా స్థానాల్లో గ్రామగ్రామాన ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేస్తున్నది. ప్రధాని మోడీ ఎంతగా ఎన్ని హామీలతో గుజరాత్ ప్రజలను ఆకట్టుకోడానికి ప్రయత్నించి ఎన్నికల తేదీలను ఆలస్యం చేయించినా పెచ్చరిల్లిన అనేక ప్రజా సమస్యలతో పాటు అధిక సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను హరించి అత్యంత విషాదాన్ని కుమ్మరించి దేశాన్నే శోక సముద్రం చేసిన మోర్బి తీగల వంతెన ప్రమాదం ప్రభావం బిజెపి విజయావకాశాలను దెబ్బ తీసే ప్రమాదం లేకపోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News