Sunday, February 9, 2025

అవినీతి కూపం.. ఆప్‌కు శాపం

- Advertisement -
- Advertisement -

అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ వ్యవస్థను తీసుకురావాలని గాంధేయవాది అన్నా హజారే 2011లో దీక్ష సాగించినప్పుడు ఆ ఉద్యమంతో ఎదిగిన ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం చారిత్రక పరిణామం. ఆనాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం వల్లనే కేజ్రీవాల్‌కు విపరీతమైన క్రేజీ వచ్చింది. అధికార వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతి, లంచగొండితనాన్ని భరించలేకపోయిన ఢిల్లీ ప్రజలకు ఆప్ ఒక ఆశాకిరణంగా కనిపించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ ఏర్పాటైన కొద్ది నెలల్లోనే 2013 లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు చాలా వరకు ఆప్‌కు మళ్లింది.

ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకోగా, ఆప్ 28 స్థానాలను సాధించి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. కొద్ది కాలానికే ప్రభుత్వం పడిపోవడంతో 2015లో ఎన్నికల్లో ఏకంగా 67 సీట్లు సాధించుకుని ప్రధాన రాజకీయ పక్షాలకు ఆశ్చర్యం కలిగించింది. 2020లో 62 సీట్లు గెలుచుకోగలిగింది. ఢిల్లీ అంటే ఆమ్‌ఆద్మీకి కోటగా కేజ్రీవాల్ మార్చినప్పటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్న పదవీకాలంలోనే ఆప్‌సర్కారు అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవినీతి మరకలు, కుంభకోణాలు ఆప్ పార్టీ పాలిట శాపంగా మారాయి. మరోసారి ఎలాగైనా ప్రజలు తనను గెలిపిస్తారన్న ధీమాతో కేజ్రీవాల్ ఉన్న తరుణంలో తానే ఓటమిపాలవ్వడం జీర్ణించుకోలేని విషయం. ఈ పరిస్థితిని ఎగ్జిట్ పోల్స్ ముందుగానే అంచనా వేశాయి. ఇటీవల సీ వోటరు సర్వే కూడా ఆప్ సర్కారుపై 43.9 శాతం మంది ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వం మారాలనుకుంటున్నారని వెల్లడించింది. మరో 10.9 శాతం మంది కూడా అసంతృప్తితో ఉన్నారని పేర్కొంది. మొత్తం మీద 55 శాతం మంది ఆప్ సర్కారుపై అసంతృప్తిగా ఉన్నారని తేల్చింది.

దీని ప్రకారమే ఇప్పుడు ఫలితాలు వెలువడడం గమనార్హం. ఢిల్లీ ఓటర్ల సంఖ్య 1.55 కోట్లు. వీరిలో 67 శాతం మంది మధ్యతరగతి వారే. వారి మనస్తత్వంలో మార్పు వచ్చింది. బడ్జెట్‌లో ఆదాయం పన్ను మినహాయింపు ద్వారా ఢిల్లీలోని మధ్యతరగతిని బిజెపి ఆకట్టుకోగలిగిందని చెబుతున్నారు. బిజెపి ‘వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పత్ర’ మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేసిందని అంటున్నారు. 1998 నుంచి ఢిల్లీలో అధికారంలో లేకపోవడంతో ఈసారి ఎలాగైనా ఢిల్లీ కోటలో పాగా వేయాలని ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జెపి నడ్డాతో సహా కమలనాథులు సర్వశక్తులూ ఒడ్డారు. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ తదితర ఆప్ నేతలను దోషులుగా ఓటర్ల ముందు ముద్ర వేయించారు. కేజ్రీవాల్ సర్కారు గత పదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో అనేక వినూత్న పథకాలను అమలు చేయడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆకర్షణలతో ప్రజలను ఆకట్టుకోగలిగింది. ప్రజాపాలనలో ఆమ్‌ఆద్మీ పాలన ఓ ప్రత్యేక నమూనాగా విస్తృత ప్రచారం కల్పించిన ఆప్ సర్కారు అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోవడంతో ప్రతిష్ఠ మసకబారింది. ఢిల్లీలో ప్రజలు కలుషిత నీరు, రోడ్ల అధ్వానంపై తీవ్ర అసంతృప్తి చెందుతుండడంతో యమునా నది నీటిని హర్యానా ప్రభుత్వం విషంగా మార్చి సరఫరా చేస్తుందని ప్రచారం సాగించారు. కానీ ఈ ప్రచారం పనిచేయలేదు. ప్రధాని మోడీ తాను ఆ నీటినే తాగుతానని ప్రచారంలో స్పష్టం చేశారు.

హర్యానా సిఎం సైనీ కూడా ఆ నీటిని తాగి చూపించడంతో కేజ్రీవాల్ ఆరోపణలకు నమ్మకం లేకుండా పోయింది. మూడేళ్ల క్రితం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కారు తీసుకొచ్చిన నూతన మద్యం విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2026 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో బయటపెట్టడం ఆప్‌కు తీరని ఇబ్బంది తెచ్చిపెట్టింది. దీనికి తోడు ఢిల్లీ సిఎం అధికార నివాసం శీష్ మహల్‌కు దాదాపు 33 కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ఇవన్నీ కేజ్రీవాల్ పాలనను ఎండగట్టడానికి బిజెపితో పాటు ఇతర విపక్షాలకు ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి. విద్యావంతులైన ఓటర్లు ఈ అవినీతిని మనసులో పెట్టుకుని కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చి ప్రచారం చేసినా ఢిల్లీలో ఒక్కచోట కూడా ఆప్ అభ్యర్థిని గెలిపించలేకపోయారు.

పంజాబ్‌లో ఆప్ మూడు స్థానాలకే పరిమితం కాగా, హర్యానాలో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అప్పటికే కేజ్రీవాల్ ప్రతిష్ఠ మసకబారిందన్న విశ్లేషణలు బయటపడ్డాయి. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ తదితరులు జైలుకు వెళ్లి వచ్చి ప్రజల సానుభూతి పొందడానికి ఎంతగానో ప్రయత్నించారు. కేంద్రంలోని కమలనాథుల కుట్రవల్లనే తమపై కేసులు బనాయించి జైళ్లకు తరలించారని చెప్పుకొచ్చారు. అయినా ఓటర్ల సానుభూతి పొందలేకపోయారు. ఎన్నికల ముందు ఏడుగురు ఎంఎల్‌ఎలు ఆప్‌కు గుడ్‌బై చెప్పడం గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఆప్ ఎంఎల్‌ఎ అభ్యర్థులకు ఎరవేసి, తమ పార్టీని అస్థిరపరిచేందుకు బిజెపి ‘ఆపరేషన్ లోటస్’ కు కుట్ర పన్నుతోందని కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించడం తీవ్ర రాద్ధాంతానికి దారి తీసింది. పలువురు ఎంఎల్‌ఎ అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేసి రూ.15 కోట్లు ఇప్పిస్తామని ఆశపెట్టినట్టు కేజ్రీవాల్, సహచర నేతలు ఆరోపించడం చివరకు ఎసిబి విచారణకు దారి తీసింది. ఒకప్పుడు హ్యాట్రిక్ విజయాలతో ఢిల్లీ రాష్ట్ర పీఠంపై కూర్చున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News