ఆవ్‌ు ఆద్మీ పార్టీ (ఆప్) నేత అర్వింద్ కేజ్రీవాల్ రాజకీ యాలకు అగ్నిపరీక్ష రేపటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. 2025 ఆరంభంలో జరిగే ఈ ఎన్నికల తర్వాత, ఏడాది చివర్లో జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు దేశంలో ఎన్నికలేవీ లేవు. కేంద్రంలోని ఎన్‌డిఎ, ముఖ్యంగా కూటమి పెద్దన్న బిజెపి తలపోస్తున్నట్టు ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఫలితంగా జమిలి ఎన్నికలు 2027లోనే జరిపేట్టయితే, ఇక 2026 లోనూ ఏ ఎన్నికలూ ఉండక పోవచ్చు.
బిజెపి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలవటం ఆప్‌కు అతిపెద్ద పరీక్ష! పాతికేళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ పీఠం తిరిగి దక్కించుకోవడం బిజెపికి అంతకన్నా పెద్ద సవాల్!! ఢిల్లీ అసెంబ్లీ గెలుచుకోవడాన్ని కాంగ్రెస్ ఒక సవాల్‌గానే స్వీకరిస్తున్నట్టు లేదు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష ‘ఇండి యా కూటమి’లో కాంగ్రెస్ ఆప్ భాగస్వాములే అయినా… ఢిల్లీ ఎన్నికలకు వారి మధ్య పొత్తు సూచనలు కనిపించడం లేదు. అది కూడా ఆప్ విజయావకాశాల్ని ప్రభావితం చేసేదే! ఇక్కడ ముఖాముఖి పోటీయా? ముక్కోణపు పోటీయా… ఇంకా తేలాల్సే ఉంది.
దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి ‘ఆప్’ రాజకీయ విస్తరణకు దేశ రాజధాని నగరమైన ఢిల్లీయే ముఖ్యపీఠం! ఢిల్లీ, అటు ఇటు కాని అర్ధ రాష్ర్టమే అయినా… పలు ప్రత్యేకతలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌కి అదొక ప్రయోగశాల అయింది. బలమైన ప్రత్యర్థి బిజెపితో పోరుకు వేదికయింది. పొరుగునున్న పంజాబ్ రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంతగా ఆప్ విస్తరణకు ఢిల్లీ దోహదపడింది. సంపూర్ణ రాష్ర్టమైన పంజాబ్ నుంచే నలుగురు ఎంపిలతో పార్లమెంటులోనూ ఆప్‌కి ప్రాతినిధ్యం దక్కింది. కానీ, అదే వాతావరణం ఉండే మరో పొరుగు రాష్ర్టం హర్యానాలో ఆప్ విస్తరణకు ఢిల్లీ ఆధిపత్యం ఏమీ పనికి రాలేదు. ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ విస్తరణకు లోగడ ఆప్ ప్రయత్నించినా, ఏ విధమైన సానుకూలతా లభించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కావ్‌ు, కేజ్రీవాల్ అరెస్టు, ఆయన రాజీనామా, మరొకరు ముఖ్యమంత్రి అవడం… వంటి పరిణామాల దరిమిలా ఉత్పన్నమైన రాజకీయ పరిస్థితుల్లో ‘ఆప్’ ప్రజాదరణ ఎలా ఉంది? కేజ్రీవాల్ ప్రతిష్ఠపై ప్రభావమెంత? ఆప్‌కు కాంగ్రెస్‌తో పొత్తు ఆస్కారముందా? ఏయే అంశాలు ఢిల్లీ ఎన్నికల సరళిని ప్రభావితం చేస్తాయి..?
ఆప్ మళ్లీ గెలిచేనా? సమాధానాలెలా ఉన్నా ఇవన్నీ ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలే! ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ‘ఇండియా టుడే’ వంటి ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాల్లోనూ ఆప్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టే వెల్లడయింది. అందుకేనమో, ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల నుంచి పూజారులు గ్రంథిలకు నెలనెలా 18 వేల జీతం వరకు… ఎడాపెడా వరాల జల్లు కురిపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకన్నా ఇతరేతర అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కాంగ్రెస్ ఆప్ నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. ఇంకో వైపు ఓటర్ల జాబితాల్లో మాయ చేస్తున్నారంటూ ఆప్ బిజెపి నాయకులూ పరస్పరం నిందించుకుంటూ… దేశ రాజధానిలో రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. ఏమైనా ఈ ఎన్నికల్లో, పాలకపక్షమైన ఆప్ గెలుపోటముల్ని రెండు మూడంశాలు ప్రభావితం చేసే ఆస్కారం బలంగా కనిపిస్తోంది.
బహుముఖాలుగా బిజెపి చేస్తున్న ప్రచారం, ప్రయత్నాల ఫలితంగా ఢిల్లీలో ‘ఆప్’కు జనాదరణ కొంత తగ్గిందనే స్థూలాభిప్రాయం ఉంది. ‘ఈసారి పోటీ గట్టిగానే ఉంటుంది. ఆప్, బిజెపిలలో ఎవరిది పైచేయి అవుతుందో చెప్పలేం’ అని, ఆటో నడుపుకునే ఓల్డ్ ఢిల్లీ నివాసి చందన్ సింగ్ చెప్పిన మాటల్ని బట్టి పరిస్థితిని కొంత మేర అర్థం చేసుకోవచ్చు. ‘ఆప్ భిన్నమైన పార్టీ’ అన్న ముద్రను చెరిపి వేసే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వపు ఎక్సైజ్ పాలసీని తప్పుబడుతూ నమోదైన ‘లిక్కర్ స్కావ్‌ు’ కేసులో అంతిమంగా ఏం తేలుతుందో తెలీదు కానీ, ‘ఆప్ కూడా మిగతా అన్ని రాజకీయ పార్టీల్లాగే… అవినీతి చేస్తుంది. గెలుపు కోసం జిమ్మిక్కు ఎన్నికల రాజకీయాలకు తలపడుతుంది’ అనే ప్రచారాన్ని ఢిల్లీ వాసుల్లోకి బలంగా తీసుకువెళ్లటంలో ప్రత్యర్థులు, ముఖ్యంగా బిజెపి వారు విజయం సాధించారు.
ప్రత్యేక సానుభూతి లేని పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఇప్పుడు ప్రధానంగా తన ‘ప్రజా సంక్షేమం జవాబుదారు ప్రభుత్వం’ కార్డు మీదే ప్రజామద్దతు గెలవాల్సి ఉంటుంది. విద్య, వైద్యం, విద్యుత్తు, నివాసం… తదితరాంశాల్లో ఆప్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ప్రజామన్నన పొందిన విషయం తెలిసిందే! ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీల ఓట్లతో ఎదిగిన ఆప్, సదరు ఓటు బ్యాంకుల్ని ఇప్పుడు ఏ మేర నిలుపుకోగలుగుతుంది? అన్నది ప్రశ్న. ముఖ్యంగా కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటే… పేద, దళిత, ముస్లిం ఓటులో ఎంత నిలుపుకోగలదు? నిలుపుకోలేకుంటే… ఆ మేర కొత్త ఓటర్లను ఆప్ ఎక్కడ్నుంచి ఆకట్టుకోగలదు? అన్నవి ప్రశ్నలు. దేశంలో, అతి ప్రజాదరణ కలిగిన రెండో ముఖ్యమంత్రిగా ఓ సర్వేలో నిలిచిన కేజ్రీవాల్ ప్రతిష్ఠ, ఫిబ్రవరి 24లో ఉన్న 19.6% నుంచి ఆగస్టు 24 నాటికి 13.8 శాతానికి పడిపోయింది.
ముఖ్యమంత్రిగా ఆయన పనితీరుపై ప్రజల్లో సంతృప్తి శాతం కూడా 58 (ఆగస్టు 23) నుంచి 44 (ఆగస్టు 24)కి తగ్గింది. ఉచితాలపైన, లిక్కర్ స్కావ్‌ుపైన సాగుతున్న విమర్శలు, ఆరోపణల తాలూకు వ్యతిరేక ప్రచారం ఈ పతనానికి కారణం కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పార్టీ వైపు మొగ్గి, లోక్‌సభకు మాత్రం జాతీయ పార్టీకి దన్నుగా నిలిచే చరిత్ర ఢిల్లీ ఓటర్లకుంది. అందుకే, 2014, 2019, 2024 మూడు ఎన్నికల్లోనూ ఆప్‌కు ఒక ఎంపి సీటూ ఇవ్వని ఓటర్లు 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్‌కే పట్టం కట్టారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ, ‘జైల్ కా బద్‌లా ఓట్ సే’ అని ప్రచారం చేసినా… 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 54% ఓట్లు (మొత్తం 7 సీట్లూ)ఇచ్చి, ఒక్క సీటూ లేకుండా ఆప్‌ను 24% ఓటు వాటాతో జనం సరిపెట్టారు.
ఎన్నికలను బట్టి వైఖరి మార్చి ఓట్లేసే పౌరులుండటం ఢిల్లీ ఎన్నికలబరి ప్రత్యేకత. పోటీ పడే పార్టీలు అవే అయినా.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక రకంగా, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకంగా, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకో రీతిన ఓటర్లు మొగ్గుచూపడం ఇక్కడ తరచూ జరుగుతోంది. వేర్వేరు ఎన్నికల్లో, ఆయా పార్టీలు పొందుతున్న ఓటు శాతాలు, సందర్భాన్ని బట్టి అవి మారే సరళిని చూస్తే… పొత్తులు కీలక పాత్ర పోషించే అవకాశముంది. గత ఎన్నికల గణాంకాలు చూస్తే, ‘అసెంబ్లీలో మీకు దన్నుగా ఉంటాం, లోక్‌సభకు మాత్రం బిజెపిని గెలిపిస్తాం’ అని ఢిల్లీ ఓటర్లు ఆప్‌కు చెబుతున్నట్టుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల మీద పోల్చి చూస్తే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 36% ఓటు వాటా ఆప్ నష్టపోయింది. మళ్లీ 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి 36% ఓటు వాటా (18% కాంగ్రెస్ నుంచి, 18% బిజెపి నుంచి) తిరిగి పెంచుకోగలిగింది.
2020 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినా… 2024 లోక్‌సభ ఎన్నికల్లో 30% ఓటు వాటాను ఆప్ (బిజెపికి 16%, కాంగ్రెస్‌కు 14%) మళ్లీ కోల్పోయింది. అంటే, ఢిల్లీ మొత్తం ఓటర్లలో ఒక 30% మంది నిర్దిష్టంగా ఏ పార్టీ సిద్ధాంతానికీ కట్టుబడ్డ విధేయత లేకుండా, ఎన్నికసందర్భం, పరిస్థితిని బట్టి అటు, ఇటు మారే స్వేచ్ఛా ఓటర్లుగా ఉన్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే, వారు రేపటి ఎన్నికల్లోనూ ఆప్‌తో ఉంటారా? బిజెపి తీవ్ర ప్రయత్నాల కారణంగానో, విడిగా పోటీపడుతున్న కాంగ్రెస్ ‘పార్టీ పునర్వికాస’ ప్రయత్నాల ఫలితంగానో… మరే ఇతర కారణాలతోనో అందులో చీలిక వస్తుందా? అన్నది ఆప్ విజయావకాశాల్ని ప్రభావితం చేస్తుంది. అంతకు మున్ను వరుసగా మూడు పర్యాయాలు షీలాదీక్షిత్ నేతృత్వంలో గెలిచిన కాంగ్రెస్ ఢిల్లీలో పదకొండేళ్లుగా ఓటమి బాటలోనేసాగుతోంది. ప్రధానంగా ‘ఆప్’ ఓటంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకులే కనుక, ఈ బ్రాకెట్ (30%) ఓట్లలో సగం ఓట్లను కాంగ్రెస్ తిరిగి తనవైపు తెచ్చుకోగలిగినా… ఆప్‌కు కష్టాలు తప్పవు. దానికి తోడు, బిజెపి ప్రచారాలు ప్రజల్లో బలంగా నాటుకొని, ఏ మాత్రం తన పరిస్థితిని ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగుపరచుకున్నా ఆప్ నిలువునా మునగడం ఖాయం!
కేజ్రీవాల్‌ను, ఆయన నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఢిల్లీ ఓటర్లు, రెండు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ మధ్య చీలడం మంచిదే అని కొందరు విశ్లేషకులంటారు. కానీ, గత ఎన్నికల గణాంకాల పట్టిక మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ఓ ఎన్నికల్లో తన ఓటు వాటా శాతాన్ని పెంచుకున్నపుడు, ఆ మేర ఆప్ నష్టపోయింది. ఆప్ బాగా పుంజుకొని, గెలుపు బాటపట్టిన ప్రతిసారీ కాంగ్రెస్ అట్టడుక్కు జారిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని ఢిల్లీ ఓటర్లు నిర్ణయించినపుడల్లా…. బిజెపి వ్యతిరేక ఓటు కాంగ్రెస్ ఆప్ మధ్య నిలువునా చీలింది. లోక్‌సభ ఎన్నికల్ని పక్కకు పెట్టి చూసినా… 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఆప్, 2017 ఢిల్లీ మహానగర కార్పొరేషన్ (ఎంసిడి) ఎన్నికల్లో, అంతకు ముందరి తన ఓటు వాటా 54% నుంచి 26కి పడిపోయి (28% నష్టం) ఓటమి పాలయింది. అప్పుడు కాంగ్రెస్ 11%, ఇతర పార్టీలు 13% ఓటు వాటా పొందాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4% ఓటు వాటా పొందిన కాంగ్రెస్, 2022 ఎంసిడి ఎన్నికల్లో పరిస్థితిని 12% కి పెంచుకున్నపుడు (8% వృద్ధి), బిజెపి కేవలం 3% ఓటు ఆధిక్యతతో కనాకష్టంగా నాటి ఎంసిడి ఎన్నికలు గెలిచి, బయటపడింది.
ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పైన గెలిచే ఆప్ సొంత ప్రభుత్వాలను ఏర్పరచింది. ఏ ప్రమాణాలతో చూసినా… ఢిల్లీలో కాంగ్రెస్ పెరుగుదల ‘ఆప్’ అవకాశాలను దెబ్బ తీసేదే! కానీ, కేజ్రీవాల్ కాంగ్రెస్‌పై కాలు దువ్వటమే కాకుండా, కాంగ్రెస్ లేని ‘ఇండియా కూటమి’ బలోపేతానికైనా ‘సై’ అంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్‌లు గొంతు పెంచి, పరస్పరం తిట్టుకుంటున్న తీరు, రెండు పార్టీల మధ్య పెరిగిన అంతరానికి ప్రతీకంగా కళ్లకు కడుతోంది. కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తానంటోంది. ఆప్ అంతకన్నా గట్టి స్వరంతో పొత్తు లేదని చెబుతోంది. కానీ, ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆప్‌ను, ఏం చేసైనా గెలువనీయొద్దని బిజెపి ఈసారి సర్వశక్తులూ ఒడ్డాలన్న పట్టుదలతో ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల నడుమ దేశ రాజధాని ఢిల్లీ రాజకీయ వాతావరణం, ఎముకలు కొరికే శీతాకాలపు చలిలో కూడా… రోజురోజుకూ వేడెక్కుతోంది.
(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)
సమకాలీన
దిలీప్‌రెడ్డి