Sunday, December 22, 2024

జైలులో కుప్పకూలిన సత్యేందర్ జైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పూర్తిగా నిస్సత్తువతో , గుర్తు పట్టలేకుండా బలహీనం అయిన ఆప్ నేత , ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో కుప్పకూలారు. దీనితో ఆయనను హుటాహుటిన ఇక్కడి ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీపార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన జైన్ గత ఏడాది మే నెల నుంచి జైలులో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారిందని పార్టీ నేత ఒక్కరు తెలిపారు. తొలుత ఆయనను జైలు అధికారులు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు అక్కడి నుంచి లోక్‌నాయక్ జయప్రకాశ్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రికి తరలించారు.

ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ఆయనను ఐసియూలో ఉంచి పరీక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉందని తమకు తెలిసిందని ఆప్ నేతలు తెలిపారు. ఆయనకు చాలా కాలంగా వెన్నునొప్పి ఉంది. గతంలో కూడా ఆయనను ఇదే ఆసుపత్రిలో ఉంచి చికిత్స జరిపించారు. ఈ మధ్యకాలంలో ఆయన పూర్తిగా నిస్సత్తువతో నడవలేని స్థితికి చేరారని వెల్లడైంది. ఇప్పుడు తీహార్ జైలులోని బాత్‌రూంలో కళ్లు తిరిగిపడిపోయినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై ఢిల్లీ సిఎం , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత గడ్డు స్థితినుంచి ఆయన బయటపడే శక్తి ని భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు మంచి చికిత్సల కోసం రాత్రింబవళ్లు తన మంత్రిపదవితో పాటుపడ్డ వ్యక్తిని శిక్షించేందుకు ఓ నియంత మొండిగా వ్యవహరిస్తున్నారు. దేవుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారని, అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. కాగా తీహార్ జైలు సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ అండర్ ట్రయల్ ఖైదీ సత్యేందర్ జైన్ ఉదయం ఆరుగంటలకు సెంట్రల్ జైలు నెంబరు 7 పరిధిలోని హాస్పిటల్‌లోని ఎంఐ రూమ్ బాత్‌రూంలో జారి పడ్డారని తెలిపారు. డాక్టర్ల బృందం పరీక్షించిందని ఆయన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News