Thursday, January 23, 2025

పంజాబ్‌లో ఆప్‌కు ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

పంజాబ్‌లో ఆప్‌కు ఎదురు దెబ్బ
సంగ్రూర్ లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి
యుపిలో ఎస్‌పి కోటకు బీటలు
రాంపూర్, ఆజంగఢ్ స్థానాలు రెండింటిలో బిజెపి విజయం
త్రిపుర ముఖ్యమంత్రి విజయం
ఉప ఎన్నికల పలితాలు వెల్లడి
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీకి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఖాళీ చేసిన సంగ్రూర్ లోక్‌సభ స్థానంలో ఆప్ ఓటమి పాలయింది. సంగ్రూర్‌లో శిరోమణి అకాలీదళ్(అమృత్‌సర్) అధ్యక్షుడు సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ ఆప్ ప్రత్యర్థి గుర్మైల్ సింగ్‌పై 5,822 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాన్‌కు 2,53,154 ఓట్లు రాగా, గుర్మైల్ సింగ్‌కు 2,47,332 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీ, బిజెపి అభ్యర్థి కేవల్ ధిల్లాన్, శిరోమణి అకాలీదళ్ కమల్‌దీప్ కౌర్ రజోనాలు వరసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో వచ్చారు. వీరిలో ఎవరికీ లక్ష ఓట్లు కూడా రాలేదు. సంగ్రూర్‌నుంచి 2014, 2019 ఎన్నికల్లో భగవంత్ సింగ్ మాన్ వరసగా రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో మాన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం కోసం లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది.

హిమాచల్ ప్రదేశ్‌కు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా ప్రచారం సాగిస్తున్న తరుణంలో ఈ ఓటమి ఆ పార్టీకి గట్టి దెబ్బేనని చెప్పవచ్చు. ఢిల్లీతో పాటుగా అయిదు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఆదివారం ఫలితాలు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, ఆజమ్‌గఢ్ లోక్‌సభ స్థానాలను భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. సమాజ్‌వాది పార్టీ కంచుకోటలుగా భావిస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లోను ఆ పార్టీ ఓడిపోవడం పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు గట్టిదెబ్బగా భావిస్తున్నారు. రాంపూర్‌లో బిజెపి అభ్యర్థి ఘన్‌శ్యామ్ లోధీ 40 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించగా, ఆజమ్ గఢ్‌లో ఆ పార్టీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ ‘నిరాహువా’ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై గెలుపొందారు. యుపి అసెంబ్లీకి ఎన్నికయిన అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆజమ్ ఖాన్‌లు రాంపూర్, ఆజంగఢ్ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అవసరమైనాయి.
త్రిపుర సిఎం ఘన విజయం
కాగా త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి మూడు చోట్ల , కాంగ్రెస్ ఒక చోట గెలుపొందింది. ముఖ్యమంత్రి మానిక్ సాహా టౌన్ బార్డోలి నుంచి 6,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అగర్తలలో కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ గెలుపొందారు. ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ బిజెపి ప్రత్యర్థి రాజేశ్ భాటియాపై 11,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి శిల్పి నేహా టిర్కే తన సమీప బిజెపి ప్రత్యర్థి గంగోత్రి కుజుర్‌పై విజయం సాధించారు.

AAP lost Lok Sabha Seat in Punjab bypoll 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News