Friday, December 20, 2024

ఆప్ ఎంపి సంజయ్ సింగ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహరంలో సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడాతో సంజయ్‌కు పరిచయాలు ఉన్నట్టు గుర్తించిన ఈడీ అధికారులు బుధవారం ఢిల్లీ లోని ఎంపీ నివాసంలో కొన్ని గంటల పాటు సోదాలు జరిపారు. ఆ తర్వాత సంజయ్ సింగ్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఆప్ నుంచి అరెస్టయిన కీలక నేతల్లో సంజయ్ సింగ్ మూడో నేత కావడం గమనార్హం. గతంలో నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేయగా, ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో కేజ్రీవాల్ సన్నిహితుడు, అప్పటి ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియాను మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, సంజయ్ సింగ్ ఈడీ తన ఇంటిపై ఎప్పటికైనా సోదాలు నిర్వహిస్తుందని ముందే గ్రహించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే ఆయన తన ఇంటి ఎదుట ‘ఈడీకి స్వాగతం’ అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా 2022 జులై 20 న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగు లోకి వచ్చిన విషయం తెలిసిందే.దీంతో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News