ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించారు. సిఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్, సిఎం అధికారిక నివాసంలోనే తనపై దాడికి పాల్పడినట్లు ఆమె సోమవారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఇంకా అధికారికంగా ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పారు. ఎంపి ఆరోపణలు ఢిల్లీలో సంచలనంగా మారాయి.
ఈ ఘటనపై డీసీపీ(నార్త్) మనోజ్ మీనా మాట్లాడుతూ.. “ఉదయం 9.34 గంటలకు సివిల్ లైన్స్ పోలీసులకు పిసిఆర్ కాల్ వచ్చింది. సిఎం నివాసంలో తనపై దాడి జరిగినట్లు ఎంపి మలివాల్ పేర్కొంది. దీంతో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ బృందం ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంది. అక్కడ ఎంపి మలివాల్ కనిపించలేదు. తర్వాత దాడిపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు ఎంపి మలివాల్ వచ్చారు. అయితే, ఫిర్యాదు నమోదు చేసేందుకు మెడికల్ టెస్టు చేయాల్సి ఉంటుందని వివరించాం. దీంతో ఫిర్యాదు చేయకుండానే మళ్లీ వస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ ను ఎంపి వెళ్లిపోయారు” అని తెలిపారు.
మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనపై స్పందించింది. ఢిల్లీ పోలీసులు ఎంపిపై జరిగిన దాడిపై దర్యాప్తు చేసి, నిందితుడిపై చర్యలు ఆదేశించింది.