న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీలు గురువారం పార్లమెంట్ వెలుపల నిరసన తెలియచేశారు. ఇది దర్యాప్తు సంస్థలను పూర్తిగా దుర్వినియోగం చేయడమేనని వారు ఆరోపించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తున్న సమయంలో ఆయనను సిబిఐ అరెస్టు చేసింది. కాగా..అంతకుముందు పార్లమెంట్ ఉభయ సభలలో ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. రాష్ట్రపతి అంటే తమకు ఎనలేని గౌరవమని, అయితే ప్రభుత్వం రాసిన ఉపన్యాసాన్ని రాష్ట్రపతి చదువుతున్నందున తాము ఉపన్యాసాన్ని బహిస్కరిస్తున్నామని వారు తెలిపారు.
ప్రజస్వామ్యం, రాజ్యాంగం గురించి మోడీ ప్రభుత్వం గొప్పగా మాట్లాడుతుందని, కాని వాస్తవానికి దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అణచివేతకు గురవుతున్నాయని పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన ఆప్ ఎంపి గుర్మీత్ సింగ్ మీట్ హయర్ ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఇండియా కూటమి నాయకులతో చర్చలు జరుపుతున్నామని, వారి సహకారాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు.
దర్యాప్తు సంస్థలను బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించే అవకాశం ఉన్న సమయంలో ఆయనను సిబిఐ హడావుడిగా అరెస్టు చేసిందని, ఇది నియంతృత్వానికి పెద్ద ఉదాహరణని గుర్మీత్ తెలిపారు.