న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరేట్ ఆల్వాకు మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) బుధవారం ప్రకటించాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మార్గరేట్ ఆల్వా అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు ఆప్ ఎంపి సంజయ్ సింగ్ బుధవారం నాడిక్కడ ప్రకటించారు. ఈ నెల 6వ తేదీన జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ రాజ్యసభ సభ్యులందరూ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గరేట్ ఆల్వాకు ఓటు వేస్తారని ఆయన తెలిపారు. అంతకు ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జెఎంఎం కూడా మార్గరేట్ ఆల్వా అభ్యర్థిత్వానికి మద్దతును ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆప్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డిఎ తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో ముగియనున్నది.
AAP Party Support Opposition Candidate Margaret Alva