ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత ఆప్‌కు చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఏసి) తన నిర్ణయాన్ని ప్రకటించింది. యశ్వంత్ సిన్హాకే మద్దతునివ్వనున్నట్లు పిఏసి ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, రాఘవ్ ఛధా, అతీశ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అయితే ముర్ము అభ్యర్థిత్వాన్ని కూడా తాము గౌరవిస్తున్నామని ప్రకటించింది. ఏదిఏమైనప్పటికీ ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే తాము ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. 10.86 లక్షల ఎలక్టోరల్ కాలేజ్‌లో ఆప్‌కు 21,308 ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎంపీల ఓట్లు 7,000కాగా, పంజాబ్ ఎంఎల్‌ఏలు (92) మంది ఓటు విలువ 10,672, ఢిల్లీ ఎంఎల్‌ఏలు(62) ఓటు విలువ 3,596, గోవాకు చెందిన ఇద్దరు ఎంఎల్‌ఏల ఓటు విలువ 40.ఆమ్ ఆద్మీ పార్టీ ఇంత కాలం తమ మద్దతు ఎవరికో తెలుపకపోవడంతో అనేక సందేహాలకు తావిచ్చింది. కాగా యశ్వంత్ సిన్హాకు అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి ముందు కేజ్రీవాల్ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్‌కు పోటీచేయాల్సిందిగా సూచించారు. కానీ ఇతర విపక్షాలు అందుకు అనుకూలంగా స్పందించలేదు. పవార్‌కు కూడా ఆప్ విపక్షాల రెండో సమావేశంలో సూచించింది. ఇక్కడ గమ్మతేమిటంటే యశ్వంత్ సిన్హా ఇంత వరకు ఆప్‌కు చెందిన ఢిల్లీ ఎంఎల్‌ఏలను, లేక పంజాబ్ ఎంఎల్‌ఏలను లేక వారి రాజ్యసభ ఎంపీలను కలువనే లేదు. ఆయన ఇటీవల తన ప్రచారం కోసం చండీగఢ్ వెళ్లినప్పుడు కూడా కలువలేదు.