న్యూఢిల్లీ : పంజాబ్‌లో విజయం దశలో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ పటిష్టత దిశలో చర్యలకు దిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో పార్టీ తరఫున సభ్యత్వ సేకరణ జరుగుతుందని ఆప్ సీనియర్ నేత సోమనాధ్ భారతీ తెలిపారు. ఢిల్లీ తరువాత పంజాబ్‌లో అధికారం దిశలో దూసుకువెళ్లిన ఆప్ పట్ల దక్షిణాది ప్రజల నుంచి మరింతగా అభిమానం వ్యక్తం అవుతోందని, దీనిని గమనించి తాము ఇప్పుడు ఆయా రాష్ట్రాల ప్రజల వద్దకు వెళ్లుతామని ఆప్ నేత తెలిపారు. ముందుగా అంతటా సభ్యత్వ నమోదు సేకరణ ప్రక్రియ ముమ్మరం చేస్తామని తెలిపారు.
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకునే వారు ఎవరైనా ఆప్‌లో చేరవచ్చునని భారతీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో దశలవారిగా ఆప్ తరఫున పాదయాత్రలు ఉంటాయని, తెలంగాణలో ఎప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆప్ పాదయాత్ర చేపడుతారు. పాదయాత్రల సందర్భంగా తమ పార్టీ ఆశయాలను ప్రజలకు తెలియచేస్తామని ఆప్ నేత వివరించారు. ఇప్పటికే తెలంగాణ ఎపిలతో పాటు పలు దక్షిణాది రాష్ట్రాలలో తమ పార్టీ శాఖలు ఉన్నాయని, వీటి ద్వారా తాము మౌలిక పరిస్థితిని ఆకళింపు చేసుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీలో ఆప్ ప్రజల జీవితాలలో మార్పులు తీసుకువచ్చిందని, ఇతర రాష్ట్రాలలో పాలనతో తమ పార్టీ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరిస్తామన్నారు.