Monday, December 23, 2024

ఆప్ X బిజెపి

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: పంజాబ్‌లో ఆప్ (ఆమ్‌ఆద్మీ పార్టీ) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లాను మంత్రి పదవి నుంచి తొలగించి అరెస్టు చేయించిన వారం రోజుల్లోనే ఢిల్లీ ఆప్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను అవినీతి ఆరోపణతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అరెస్టు చేయించింది. ఈ రెండు సంఘటనలూ విడివిడిగా జరిగినవా లేక పరస్పరం సంబంధం వున్నవా అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నేరాల విచారణ సంస్థ. తమ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేయడంలో దిట్టలు అనిపించుకుంటున్న కేంద్రంలోని బిజెపి పాలకులు సత్యేంద్ర జైన్ విషయంలో అకారణ కక్ష సాధింపుకి పాల్పడ్డారా? ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంత్రి సత్యేంద్ర జైన్ మంచి వాడని, అవినీతికి దూరంగా వుంటాడని ప్రశంసించారు. తమకు భగత్ సింగ్ ఆదర్శమని చెప్పుకున్నారు. మంత్రి అరెస్టు కుట్ర పూరితమన్నారు.

సత్యేంద్ర జైన్‌పై కేసు ఎనిమిదేళ్ల నాటిదని, త్వరలో ఎన్నికలు జరగబోయే హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ ఇన్‌చార్జ్‌గా ఆయనను నియమించినందువల్లనే కేంద్రం ఆయనను అరెస్టు చేయించిందని అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. జైన్‌కు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఆయన గతంలో ఇడి ఎదుట ఏడు సార్లు హాజరయ్యాడని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి దారుణంగా దెబ్బ తినబోతున్నదని, అందుచేతనే జైన్‌ను అరెస్టు చేయించారన్నది ఆప్ పెద్దల ఉమ్మడి అభిప్రాయం. పంజాబ్‌లో ఆప్ తన మంత్రిని అవినీతిపరుడుగా పరిగణించి అరెస్టు చేసి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఆప్ అంత గొప్ప నీతిమంతురాలేమీ కాదని చెప్పడానికి ఢిల్లీలో ఆప్ ఆరోగ్య మంత్రిని ఇడి చేత కేంద్రంలోని బిజెపి పాలకులు అరెస్టు చేయించారని అనుకోవాలా? రెండు కేసుల్లోనూ అవినీతి వున్నమాట వాస్తవమో కాదో న్యాయ స్థానంలో నిగ్గు తేలితేగాని ఈ విషయంపై ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేము.

ఈలోగా ఢిల్లీ మంత్రి అరెస్టును హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆప్ మీద సునిశిత అస్త్రంగా బిజెపి ఉపయోగించుకోవచ్చు. ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పక్షాల నాయకుల ఇళ్లలో సోదాలు జరిపించడం, కేసులు దాఖలు చేయించడం కేంద్రంలో అధికారంలో గల బిజెపికి అలవాటైన విద్య. రాజకీయాల్లో నీతి అనేది నేతి బీరకాయలోని నెయ్యి వంటిదేనని 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో సందేహాతీతంగా రుజువైపోయింది. దొరికితేనే దొంగ, దొరకని వాడు దొర అనే సామెత ఆచరణలో కనిపిస్తున్నది. పాలకులను నిలదీసి ప్రశ్నించేవారిపై కక్ష, శిక్ష తప్పవనే పరిస్థితి సుస్పష్టం. రాజకీయాల్లో రాణించాలంటే అడ్డదారులు తొక్కడం అనివార్యమనే వాతావరణం స్థిరపడిపోయింది. అటువంటప్పుడు అవినీతి రహిత పరిపాలనను అందించడం తృటిలో జరిగే పని కాదు. దశల వారీగా వివిధ స్థాయిల్లో అవినీతిని అరికట్టడానికి నిరంతరం కృషి జరగవలసి వుంది. అలా కృషి చేసే వారు ప్రధానంగా నీతిమంతులు కావాలి. అవినీతి రహిత పాలనను అందించాలన్న ఆప్ పట్టుదలను హర్షించవలసిందే. అవినీతి నిరోధక శాఖ వంటి యంత్రాంగాల దాడుల్లో లంచగొండి ఉద్యోగులు తరచూ పట్టుబడుతున్నప్పటికీ అవినీతి మాత్రం నిర్మూలన కావడం లేదు.

ఇంచుమించుగా చిన్న, పెద్ద అందరూ ఉద్యోగులు సుఖవంతమైన జీవనం కోసం అవినీతిని ఆశ్రయించడం మామూలైపోయింది. వచ్చే జీతాలతో సరిపెట్టుకొని బతకడమనేది అరుదుగా వుంది. ఓటుకు డబ్బు, మద్యం అలవాటు చేయడంలో మన నాయకులు ఎప్పుడో విజయం సాధించారు. ఢిల్లీలో ఆప్ మంచి పాలనను వాగ్దానం చేసింది. అక్కడి పౌరులు దానిని నమ్మారు. ఆ విధంగా అధికారంలోకి వచ్చిన ఆప్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో చెప్పుకోదగిన మంచి పనులు చేసింది. అక్కడి పాఠశాలలను బాగు పరిచింది. మొహల్లా దవాఖానాలు దేశ వ్యాప్తంగా మెప్పును పొందాయి. పంజాబ్ ప్రజలు ఢిల్లీ నమూనాను హర్షించారు. అందుకే కాంగ్రెస్‌ను, అకాళీదల్‌ను కాదని ఆప్‌ను అధికారంలోకి పంపించారు. ఆ ఉత్సాహంతో అక్కడ ఆప్ తొలి అడుగు నుంచే అవినీతి నిర్మూలనను చేపట్టింది. ప్రముఖులకు పోలీసు రక్షణను తొలగించి వేయడం తొందర పడిందనే అభిప్రాయం నెలకొన్నది. ఇది జరిగిన మరుసటి రోజే ప్రఖ్యాత గాయకుడు కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలాను దుండగులు హత్య చేశారు. పోలీసు రక్షణను ప్రభుత్వం తొలగించకపోయి వుంటే ఈ విషాదం జరిగి వుండేది కాదనే అభిప్రాయం ఏర్పడింది. ప్రజల మెప్పుతో సంక్రమించిన అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఎంతో నేర్పుగా పరిపాలన సాగించాల్సి వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News