Saturday, February 8, 2025

మద్యం విధానంతో మునిగిన ఆప్

- Advertisement -
- Advertisement -

ముంబయి : భారతీయ జనతా పార్టీ (బిజెపి) 26 సంవత్సరాలకుపైగా తరువాత ఢిల్లీలో అధికార పీఠం అధిష్ఠిస్తుండడంతో అర్వింద్ కేజ్రీవాల్‌కు ఒకప్పుడు గురువు అయిన సంఘ సేవకుడు అన్నా హజారె ఆప్ పరాజయానికి స్పందిస్తూ మద్యం విధానం, డబ్బుపై దృష్టి కేంద్రీకరించడం కారణంగా ఆప్ ‘మునిగిపోయింది’ అని విమర్శించారు. కేజ్రీవాల్‌పై అవినీతి వ్యతిరేక కార్యకర్త హజారె వ్యంగ్యోక్తులు విసురుతూ, అభ్యర్థి నిష్కళంకుడుగా ఉండాలని, అతను త్యాగం విలువ తెలుసుకోవాలని అన్నారు. అన్నా హజారె అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 70 మంది సభ్యుల ఢిల్లీ శాసనసభకు ఎన్నికల్లో బిజెపి చేతిలో ఓడిపోయింది. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సారథ్యం వహించిన అన్నా హజారె రాలెగావ్ సిద్ధి గ్రామంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ, ‘మద్యం విధానంతో డబ్బు వచ్చింది.

వారు దానిలో నిండా మునిగారు. (ఆప్) ప్రతిష్ఠ మసకబారింది. ఆయన (అర్వింద్ కేజ్రీవాల్) నిష్కళంక లక్షణం గురించి, అటుపిమ్మట మద్యం గురించి మాట్లాడడాన్ని జనం చూశారు’ అని చెప్పారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయవలసిన అవసరాన్ని ఆప్ గ్రహించలేక తప్పుడు మార్గం అనుసరించడం కారణంగానే ఓడిపోయిందని హజారె అన్నారు. ‘డబ్బుదే ఆధిపత్యం అయింది. అది ఆప్ ప్రతిష్ఠను దెబ్బ తీసి, దాని ఓటమికి దారి తీసింది’ అని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ 2012లో ఆప్ ఏర్పాటుకు నిర్ణయించిన తరువాత హజారె, ఆయన విడిపోయారు. సిబిఐ, ఇడి సమాచారం ప్రకారం,202122 కాలానికి ఢిల్లీ మద్యం విధానాన్ని సవరిస్తున్నప్పుడు అక్రమాలు చోటు చేసుకున్నాయి, లైసెన్స్‌దారులకు అనుచిత వరాలు ఇవ్వడమైంది.

ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న మద్యం విధానాన్ని అమలుపరచింది. కానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2022 సెప్టెంబర్‌లో ఆ విధానాన్ని రద్దు చేసింది. ఆప్ ఏర్పాటైనప్పుడు తాను రాజకీయాలకు దూరంగా జరిగినట్లు హజారె తెలియజేశారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అభ్యర్థి నిష్కళంకుడుగా ఉండాలని మొదటి నుంచి చెబుతున్నాను. అభ్యర్థి త్యాగం విలువలు తెలుసుకోవాలి, అవమానాలను సహించే శక్తి కలిగి ఉండాలి. (అభ్యర్థుల్లో) ఆ లక్షణాలు ప్రజల నమ్మకాన్ని పొందుతాయి. తమ కోసం అభ్యర్థి ఏదో ఒకటి చేస్తారని వారు భావిస్తారు. దీనిని నేను చెబుతూనే వచ్చాను. కానీ వారు (ఆప్) దానిని అర్థం చేసుకోలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరోపణలు వచ్చినప్పుడు అవి తప్పు అని ప్రజలకు స్పష్టం చేయడం అవసరమని హజారె అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News