Monday, December 23, 2024

సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌కు అవరోధాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చర్చలను సాధ్యమైనంత త్వరితంగా ముగించాలని ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయించినప్పటికీ కనీసం మూడు రాష్ట్రాలలో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు కనిపించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్ట పరిస్థితి ఎదురయ్యే అకాశం కనపడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. తాము కూడా తమ రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా ప్రకటించారు. తాము 23 స్థానాలలో పోటీ చేస్తామని మహారాష్ట్రలో శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) డిమాండ్ చేయడంతో అక్కడ చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది.

ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన టిఎంసి పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మమతా బెనర్జీ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఉంటుందని, కాని పశ్చిమ బెంగాల్‌లో మాత్రం టిఎంసి ఒంటరిగా పోటీ చేసి బిజెపిని ఓడిస్తుందని ఆమె ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపికి టిఎంసి మాత్రమే బుద్ధిచెప్పగలదని, మరే ఇతర పార్టీ ఆ పని చేయలేదని ఆమె చెప్పారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, ఎన్‌సిపి కలిసి పోటీ చేయగా మొత్తం 48 సీట్లలో కేవలం ఒక్క సీటును మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా నాలుగు సీట్లలో ఎన్‌సిపి గెలుపొందింది. ఆ ఎన్నికలలో బిజెపి, శివసేన కలసి పోటీ చేశాయి. బిజెపి 23 స్థానాలలో గెలుపొందగా 18 స్థానాలలో శివసేన విజయం సాధించింది. 2024 ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే కీలక రాష్ట్రం కాదు.

ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం), ఎన్‌సిపి(శరద్ పవార్ వర్గం)కి కూడా చాలా ముఖ్యమైన రాష్ట్రం. మహారాష్ట్రలో సంస్థాగతంగా బలపడేందుకు కాంగ్రెస్ అనేక వ్యూహాలను రచిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనున్నది. రాష్ట్రంలో తన బలాన్ని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ తన 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని గత గురువారం నాగపూర్‌లో నిర్వహించింది. అయితే శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) మాత్రం లోక్‌సభ స్థానాలలో అధిక స్థానాల కోసం పట్టుపడుతోంది. ఆ పార్టీ 23 సీట్లు డిమాండ్ చేయగా కాంగ్రెస్ అందుకు ససేమిరా అంది. శివసేన డిమాండ్‌ను మరీ అతిమాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ చవాన్ అభివర్ణించారు. పార్టీల మధ్య సర్దుబాటు ధోరణి ఉండాలని ఆయన చెప్పారు.

ఇలా ఉండగా పంజాబ్‌లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఇటీవల డిమాండ్ చేశారు. డిసెంబర్ 26న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో జరిగిన సమావేశంలో పంజాబ్‌కు చెందిన పార్టీ అగ్రనాయకులు అదే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. కాగా..డిసెంబర్ 17న పంజాబ్‌లోని బటిండలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలలో ఆప్ అభ్యర్థులనే గెలిపించాలంటూ ప్రజలను కోరారు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని సూచనప్రాయంగా ఆయన వెల్లడించినట్లయింది. ఇదే పరిస్థితిని ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News