Thursday, January 23, 2025

‘ఆప్’రే!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) చాప కింద నీటిని తలపిస్తున్నది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పదిహేనేళ్ల బిజెపి పాలనను అంతమొందించి కేంద్ర పాలక పక్షాన్ని దాని కాళ్ళ వద్దనే కంగు తినిపించింది. కార్పొరేషన్‌లోని 250 స్థానాల్లో 134 స్థానాలు గెలుచుకొని కమలం పార్టీ కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. తీవ్ర పోటీ ఇచ్చిన బిజెపి కేవలం 104 స్థానాలతో సరిపుచ్చుకోవలసి వచ్చింది. విజయం సాధించిన వెంటనే ఆప్ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలకు మరింత మెరుగైన పౌర సౌకర్యాలు కలిగిస్తామని హామీ ఇచ్చారు. అందుకు కేంద్రం అండదండలు, ప్రధాని మోడీ ఆశీస్సులు అవసరమన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు కూడా ఆయన ఇలాగే అన్నారు. ఆప్ విజయాలకు దాని ఢిల్లీ మోడల్ కారణమన్నది తెలిసిందే.

నాణ్యమయిన విద్య, వైద్యం, ఉచిత విద్యుత్ వంటివి కేజ్రీవాల్ ఢిల్లీ నమూనా పాలనాంశాలుగా ప్రసిద్ధికెక్కాయి. అయితే ఢిల్లీ కార్పొరేషన్ పరిధిలో ఈ మోడల్‌ను మెరుగ్గా అమలు చేయడానికి కేంద్రం యే మేరకు సహకరిస్తుందో వేచి చూడాలి. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పాలనను ముందుకు సాగనివ్వకుండా ముందరి కాళ్లకు కేంద్రం ఎన్ని బంధాలు వేస్తున్నదో తెలిసిందే. కార్పొరేషన్ పాలనలో ఆప్‌కి కేంద్రంలోని బిజెపి, ప్రధాని మోడీ సహకారం అందించడం మాట ఎలా వున్నా గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి సునామీ ఫలితాలు సాధించడంలో బిజెపికి అది తోడ్పడిన తీరు వర్ణించడానికి అలవి కానిది. బిజెపి కాంగ్రెస్‌ల మధ్య ద్వంద్వ యుద్ధ రంగంగా వుంటూ వచ్చిన గుజరాత్ ఎన్నికల్లో దూరి త్రిముఖ పోటీని సృష్టించిన ఆప్ గెలుచుకొన్నవి కేవలం 5 స్థానాలే అయినప్పటికీ దాని దెబ్బకు కాంగ్రెస్ నడ్డి విరిగి ఆసుపత్రిలో చేరింది.

 

2017 ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకొన్న కాంగ్రెస్ ఈసారి 17 స్థానాల వద్ద ఆగిపోడమే కాకుండా దాని ఓటు శాతం 41 నుంచి 27.3 శాతానికి పడిపోయింది. ఇందుకు పూర్తి కారణం ఆప్ రంగంలో వుండడమే. గతంతో పోలిస్తే కాంగ్రెస్ 13.3 శాతం ఓట్లను కోల్పోయింది. ఆప్‌కి 13 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కోల్పోయిన ఓట్లు ఆప్ ఖాతాలో పడ్డాయి. ప్రధాని మోడీ తరచూ శపథం చేసే కాంగ్రెస్ ముక్త భారత్‌కు నాందీ ప్రస్తావనను ఆప్ గుజరాత్ గడ్డ మీద ఈ విధంగా చూపించింది అనుకోవాలి. గత ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో అధికారం నిలబెట్టుకున్న బిజెపి ఈసారి ఓడిపోడానికి ఉండిన ప్రమాదాన్ని ఆప్ నిరోధించింది అనడం అతిశయోక్తి కాబోదు. 156 స్థానాల అసాధారణ మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించానని ఉప్పొంగిపోడానికి బదులు బిజెపి తన గెలుపు ఆప్, అటువంటి ఒకటి, రెండు చీలు ఓట్ల పార్టీల ప్రభావంతో సాధ్యమైందనే చేదు సత్యాన్ని గ్రహించి నడుచుకోవాలి.

బిజెపి గెలుచుకొన్న దాదాపు 100 సీట్లలో దానికి వచ్చిన మెజారిటీలు 1000 లోపేనని సమాచారం. అంటే కాంగ్రెస్ ఓట్లను ఆప్ చీల్చినందువల్లనే ఇది సాధ్యమైందని భావించాలి. ఇప్పుడిప్పుడే ఇసి బయటపెడుతున్న ఓటు వివరాలను బట్టి ఎస్‌టిలకు ప్రత్యేకించిన, పట్టీదార్లు ఆధిక్యంలో గల కనీసం 50 స్థానాల్లో కాంగ్రెస్ ఓట్లను ఆప్ చీల్చింది. ఏ పార్టీ అయినా దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తే అవి చీల్చుకొనే కొద్ది గొప్ప ఓట్లు కూడా ప్రాబల్యం గల ఒక పెద్ద పార్టీ సునాయాస విజయానికి దోహదం చేస్తాయని, సాపేక్షంగా బలహీనంగా వున్న పార్టీని మరింత బలహీన పరుస్తాయని గుజరాత్ ఎన్నికలు మరొక సారి చాటాయి. గతంలో బీహార్‌లో ఆర్‌జెడి ఏకైక పెద్ద పార్టీగా వచ్చినా అధికారం చేజిక్కించుకోలేకపోడానికీ ఇటువంటి ఓటు విభజన పార్టీల ప్రావీణ్యమే కారణమని అనుకొన్నారు.

ఢిల్లీ దాటి మొదటిసారిగా పంజాబ్‌లో మంచి మెజారిటీతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అది నెమ్మది నెమ్మదిగా ఒకటొకటిగా రాష్ట్రాలను చేజిక్కించుకొని బిజెపికి గట్టి పోటీ అవుతుందని ఆశించాము. అది ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా గుజరాత్‌లో బెబ్బులి గోళ్ళను పదునుపెట్టడంలో ఉపయోగపడిందనిపించుకొన్నది. బిజెపి తాను ప్రజల వద్ద అప్రతిష్ఠ పాలయిన తర్వాత వ్యతిరేక ఓటును ప్రభావరహితం చేయడానికి బి టీంను ప్రయోగించి ప్రతిపక్ష ఓటును చీల్చడం ద్వారా విజయావకాశాలు కాపాడుకొనే తంత్రాన్ని మరింతగా ఆశ్రయించవచ్చు. అందరూ బిజెపి పాలనకు చరమగీతం పాడాలనుకొంటున్నారు. కాని వారు కలవలేకపోతున్నారు. బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి ఇప్పటికే చాలా మథనం జరిగింది. ఇంకా జరగనుంది. బలమైన శత్రువు చావాలంటే అటువంటి మహా పరిణామాన్ని కోరుకొనేవారందరూ సంఘటితం కాకుండా చెల్లాచెదరై వుంటే అది ఎలా సాధ్యమవుతుంది? గుజరాత్‌లో మాదిరిగా తాము దేనితోనైతే పోరాడుతున్నారో దానికే మేలు చేసేవారయితే ఏమి ప్రయోజనం! బిజెపి పతనాన్ని కోరుకొనేవారందరూ తలలు చేర్చి యోచించవలసిన అంశమిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News