Monday, December 23, 2024

డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు

- Advertisement -
- Advertisement -

చౌటుప్పల్ : -వైద్య, విద్యా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రులు టి.హరీష్‌రావు, జి.జగదీశ్వర్‌రెడ్డిల చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను గూరించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ డయాలసిస్ పేషెంట్లకు సింగిల్ యూజ్ ఫిల్టర్ మెథడ్ ద్వారా ప్రతి పేషెంట్‌కు ఫిల్టర్ మార్చుతూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన తమిళనాడు సిఎం స్టాలిన్ ఇక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకుని ఇదే విధానాన్ని తమిళనాడులో కూడా అమలు చేయడం మనకు ఎంతో గర్వ కారణమన్నారు.

సిఎం కెసిఆర్ దూరదృష్టితో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, వారికి ఉచితంగా బస్‌పాస్‌లు అందించడం, డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లను కూడా మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో మొత్తం మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే వుండేవని, ఇప్పుడు ఆ సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 102కు పెంచి ఉచితంగా సేవలందిస్తుందని తెలిపారు. డయాలసిస్ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం యేటా రూ. 100 కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో పాలియేటివ్ కేంద్రం ద్వారా మంచి వైద్య సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మునుగోడు నియోజకవర్గానికి త్వరలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తూ అందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించక పోవడం భాదాకరమన్నారు. నల్లొండ, సూర్యాపేట్‌లలో మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ఘనత సిఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలకు దక్కుతుందన్నారు. అలాగే నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను కూడా ఈ యేడు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్టంలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే వుండేవని తెలంగాణ ఏర్పడిన తరువాత 12 కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఎంబిబిఎస్ చదవాలంటే చైనా, రష్యా, ఉక్రెయిన్ వెళ్లి నానా తంటాలు పడేవారని, ఇకపై ఆ పరిస్థితి వుండదన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్యయాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఆసుపత్రి మౌళిక సదుపాయాల సంసచైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నూ నాయక్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ అలివేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News