నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు..?
దుబాయ్: తాలిబన్ల కీలకనేత, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ఘనీ బరాదార్ మంగళవారం ఖతార్‌ను వీడి అప్ఘానిస్థాన్‌కు బయలుదేరారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడుగానేగాక తాలిబన్ వ్యవస్థాపకుడైన (ఘనీ సమీప బంధువు) మహ్మద్ ఒమర్ మరణానంతరం కీలక నిర్ణయాలు తీసుకున్న నేతగా అబ్దుల్‌ఘనీకి పేరున్నది. వీరిద్దరినీ ముల్లాలుగా తాలిబన్లు పిలుస్తారు. ముల్లా లేదా బరాదార్ అనే పదాలకు సోదరుడని అర్థం. అఫ్ఘానిస్థాన్‌కు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేతగా అబ్దుల్‌ఘనీపై అంతర్జాతీయ మీడియాలో ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. అఫ్ఘన్‌లో తాలిబన్ల దూకుడుకు ఊతమిచ్చిన సంఘటనగా అమెరికాతో గతేడాది దోహాలో జరిగిన ఒప్పందమేనన్నది తెలిసిందే. 2020,ఫిబ్రవరి 29న జరిగిన ఆ ఒప్పందానికి సంబంధించి తాలిబన్ల బృందం తరఫున చర్చల్లో పాల్గొన్నది కూడా అబ్దుల్‌ఘనీనే. ఈ ఏడాది జులైలో చైనాకు వెళ్లిన ఘనీ బృందం ఆ దేశ విదేశాంగమంత్రి వాంగ్‌యీతో అఫ్ఘన్‌లో తమ ప్రణాళికల గురించి చర్చించారు.
పౌరులకు భరోసా కల్పించాలని ఖతార్ నేత హితబోధ
ఖతార్‌ను వీడటానికి ముందు ఆ దేశ విదేశాంగమంత్రి షేఖ్ మహ్మద్‌బిన్ అబ్దుల్ రెహ్మాన్‌తో ఘనీ సుదీర్ఘంగా చర్చించినట్టు తాలిబన్ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అఫ్ఘన్ తాజా పరిస్థితులపైనే వారిరువురి మధ్యా చర్చలు సాగినట్టు తెలిపారు. పౌరులకు భద్రత కల్పించడంపై దృష్టి సారించాలని తాలిబన్ నేతకు అబ్దుల్‌రెహ్మాన్ సూచించినట్టు తెలిపారు. శాంతియుత అధికార బదిలీకి సమగ్ర రాజకీయ ఒప్పందం అవసరమని కూడా రెహ్మాన్ సూచించారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను నెలకొలపడం కూడా ఆవశ్యకమని ఖతార్ నేత తాలిబన్ నాయకుడికి హితవు పలికినట్టు ఆ ప్రకటన పేర్కొన్నది.