బిజెపి విమర్శ
న్యూఢిల్లీ: ఎబిజి షిప్‌యార్డ్ చేసిన బ్యాంకు కుంభకోణం యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేనని బిజెపి బుధవారం విమర్శించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను లక్షంగా చేసుకుని విమర్శించింది. కాగా ఈ నేరాన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి, సకాలంలో చర్యలు తీసుకుందని బిజెపి ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా “ పెద్ద కుంభకోణం” అని అభివర్ణించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంటగట్టారు. కానీ దర్యాప్తులో ఈ కుంభకోణం యుపిఏ హయాంలో జరిగిందేనని రుజువైంది” అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ సిగలో ఇది మరో ‘ఈక’ అని త్రివేది ఆరోపించారు. “రూ. 22,000 కోట్ల ఈ కుంభకోణం 2012లో మొదలయింది. ఆ కంపెనీ రుణంను 2014లో రీస్ట్రక్చర్ చేశారు. అది కూడా యుపిఏ చివరి రోజుల్లో. 2016లో తప్పులు జరిగాయని ఆడిటర్ నివేదిక వెల్లడించింది” అంటూ ఆయన సిబిఐ నివేదికను ఉటంకించారు. ఎబిజి షిప్‌యార్డ్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేశ్ అగర్వాల్ విషయంలో లుకవుట్ నోటీస్ జారీచేసినట్లు సిబిఐ మంగళవారం పేర్కొంది. రూ. 22,842 కోట్ల ఈ బ్యాంకు కుంభకోణంలో ఇంకా ఎనిమిది మంది ఇతరులు కూడా ఉన్నారు. అంతేకాక ఈ కుంభకోణంకు సంబంధించిన ఇతర వివరాలను కూడా సిబిఐ ఇచ్చింది.