Sunday, January 19, 2025

ఆరు గ్యారెంటీలను ఆలస్యం చేయడానికే అభయహస్తం దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పథకాలకు ఏవిధంగా జత చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విరుచుకపడ్డ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును ఆలస్యం చేయడానికే ప్రజాపాలన – అభయహస్తం దరఖాస్తుల పేరుతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని కేంద్రమంతి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా పథకాలకు వాటిని జత చేయాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.  తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న లబ్ధిదారుల సమాచారంతో పథకాలను అమలు చేసే అవకాశం ఉందని, అభయహస్తం రాజకీయ లబ్ది కోసం తప్ప.. సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదన్నారు.

దరఖాస్తు పత్రాలను రూ. 50 వరకు విక్రయించే పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభయహస్తం దరఖాస్తు ఇవ్వకుంటే పేదలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందించలేమని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దరఖాస్తులు లేకుండానే హామీల అమలుకు ఎన్నో సదుపాయాలు ఉన్నాయని, ప్రధాని కిసాన్ సమ్మాన్, రైతు భరోసా డేటా ఉన్న తరువాత మళ్లీ రైతుబంధు కోసం వివరాలు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణతో పాటు కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ మెడిసిన్ గడువు ముగిసిందని చెబుతున్నారని కానీ మోడీ దేశాన్నే కాదు  ప్రపంచాన్ని నడిపించే సంజీవిని అని గుర్తుంచుకోవాలని చురక అంటించారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం మోడీ మెడిసిన్ బాగా పనిచేస్తుందన్నారు. అసలు ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ మెడిసిన్ ఫార్ములానే తిరస్కరణ అయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలోకి సిబిఐ రాకుండా గత ప్రభుత్వం అడ్డుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చిందని సిబిఐకి ప్రభుత్వం లేఖ రాయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణతో పాటు న్యాయ విచారణ కావాలని తాను కోరానని కానీ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న చందంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. తనపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

అయోధ్య రామమందిరం హిందువుల విశ్వాసానికి ప్రతీక, మన జాతికి చిహ్నమని తెలిపారు. దేశం మీద దాడి చేసి మన సంస్కృతి, ఆచారాలను దెబ్బ తీసిన విదేశీయులకు వ్యతిరేకంగా, బానిస మనస్తత్వం నుంచి బయట పడటానికి ప్రతీక రామ మందిరం అన్నారు. ఈనెల 14 నుండి 22 వరకు పుణ్యక్షేత్రాలు, ప్రార్థన మందిరాలలో స్వచ్చత అభియాన్ తమ పార్టీ చేపడుతుందన్నారు. ఈనెల 22న రామాలయ ప్రాణ పతిష్ట సందర్భంగా ప్రజలంతా ఇల్లు అలకరించుకుని సాయంత్రం 5 గంటలకు దీపాలు వెలిగించాలన్నారు.

అంధుల అక్షర ప్రదాత డాక్టర్ లూయిస్ బ్రెయిలీ: 
డాక్టర్ లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం ఎంతో శ్రమించారని, లిపి కనిపెట్టి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. 217వ జయంతి వేడుకల్లో పాల్గొన్ని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో దివ్యాంగులకు సమాన అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలిచిందని తెలిపారు. దేశంలో సుమారుగా మూడు శాతం మంది దివ్యాంగులు ఉన్నారని వారి సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వికలాంగుల హక్కుల చట్టం 2016ను తీసుకొచ్చి, వికలాంగుల రిజర్వేషన్ మూడు శాతం నుంచి నాలుగు శాతం పెంచమని తెలిపారు. దివ్యాంగుల వైకలాల్యలను 7 రకాల నుంచి 21 రకాలకు పెంచిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. దివ్యాంగులకు కావాల్సిన సహాయ పరికరాలను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్ రావు, నాయకులు శ్రీనివాస్, రామచందర్, పులిపాటి శ్రీనివాస్ పాండు, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News